Brazil floods: భారీ వరదల కారణంగా బ్రెజిల్‌లోని ఈశాన్య ప్రాంతంలో కనీసం 18 మంది మరణించారు. 280 మందికి పైగా గాయపడ్డారు. ఈ వరదలు కారణంగా సుమారు 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బహియా సివిల్ డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ వరదల ప్రభావం కనీసం 40 పైగా పట్టణాల్లో కనిపిస్తుందని బహియా గవర్నర్ రుయి కోస్టా ఇల్హెయూస్ తెలిపారు.
బహియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని బ్రెజిల్ వాతావరణ, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు మంగళవారం వరకు కురిసే అవకాశం ఉందని అజెన్సియా బ్రాసిల్ తెలిపింది.
'ఇది ఒక భారీ విషాదం. బహియా చరిత్రలో ఇలాంటి భారీ వర్షాలు ఎప్పుడూ సంభవించలేదు. చాలా నగరాలు ఈ వరదల్లో చిక్కుకున్నాయి. ఇప్పటికే చాలా ఇళ్లు నీట మునిగాయి.'అని కోస్టా ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాల కారణంగా ఇటాంబే నగరంలో శనివారం అర్ధరాత్రి ఓ ఆనకట్ట తెగిపోవడం కారణంగా వరదలు ముంచెత్తుతాయనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నట్లు స్థానిక మీడియో తెలిపింది. ఇప్పటికే బహియాలో వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరో రెండు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాబోయే 48 గంటల్లో విస్తారంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బహియాలో సుమారు 50 మి.మీ నుంచి 100 మి.మీ వరకు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గ్రీస్‌లో భూప్రకంపనలు- హడలెత్తిన జనం!