దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం ఉగ్రవాదుల దిగ్భంధంలో ఉన్న హోటల్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు సోమాలియా భద్రతా సిబ్బంది. హోటల్లోకి చొరబడిన నలుగురు ముష్కరులను హతమార్చారు. పదుల సంఖ్యలో పౌరులను కాపాడారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 15కు పెరిగినట్లు సోమాలియా సమాచార శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ముఖ్తార్ వెల్లడించారు.
ఇదీ జరిగింది.
సోమాలియా రాజధాని మొగదిషులో బీచ్ పక్కన ఉన్న ప్రముఖ ఎలైట్ హోటల్‌పై ఆదివారం మధ్యాహ్నం దాడికి తెగబెడ్డారు ఉగ్రవాదులు. సెక్యూరిటీ గేట్లను కారు బాంబుతో ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. ప్రశాంతంగా బస చేస్తున్న అమాయకులపై తూటాల వర్షం కురిపించారు. హోటల్‌ను దిగ్బంధించారు.
తొలుత ఈ ఘటనలో 10 మంది పౌరులు మరణించినట్లు చెప్పారు పోలీసులు. ఆపరేషన్ పూర్తయిన అనంతరం మృతుల సంఖ్య 15కు పెరిగినట్లు తెలిపారు. మొత్తం 20మందికిపైగా గాయపడ్డారని చెప్పారు.
గత కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న సోమాలియా ఈ ఘటనతో మళ్లీ ఉలిక్కిపడింది. హోటల్‌పై దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ అతివాద రెబల్స్, అల్‌ఖైదా అనుబంధ అల్ షబాబ్ ప్రకటించింది.