సెంట్రల్ ఆఫ్రికా కాంగోలోని తూర్పు కాంగోలో ఉగ్రవాదులు జరిపిన వేరు వేరు దాడుల్లో 35మంది పౌరులు మరణించారు. కవుయూరి ప్రాంతంలోని విరుంగా జాతీయ పార్కులో జరిపిన దాడిలో 29 మృతదేహాలను గుర్తించామని స్థానిక గవర్నర్ తెలిపారు. బెనీ ప్రాంతంలో మంగళవారం జరిగిన మరో దాడిలో ఆరుగురు పౌరులు మరణించారని పేర్కొన్నారు. ఏడీఎఫ్ దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపులతో కలసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారనివెల్లడించారు.
తూర్పు కాంగోలో మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించినప్పటి నుంచి ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయని స్థానిక అధికారులు వివరించారు.
ఓ స్థానిక సివిల్ సొసైటీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఒక్క నెలలోనే ఏడీఎఫ్ దళాలు జరిపిన దాడుల్లో మొత్తం 86మంది పౌరులు మృతిచెందారని తెలిపారు. 2019 నుంచి వేయి మందికి పైగా దాడుల్లో మరణించారని వెల్లడించారు.