నానాటికీ విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనడానికి కొన్ని దేశాల్లో ఇప్పటికీ సరైన వైద్య సదుపాయాలు, పరికరాల్లేవు. సుమారు 1.2 కోట్ల జనాభా గలిగిన దక్షిణ సుడాన్‌లో నాలుగంటే నాలుగే వెంటిలేటర్లు, 24 ఐసీయూ పడకలే ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ(ఐఆర్‌సీ) అందించిన సమాచారం ప్రకారం.. మరికొన్ని దేశాల్లోనూ వైద్య రంగం పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది.
బర్కినా ఫాసో దేశంలో 11, సియర్రా లియోన్‌లో 13, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో 3 వెంటిలేటర్లే ఉన్నాయి. దాదాపు 3 కోట్ల జనాభా కలిగిన వెనెజువెలా దేశంలో 84 ఐసీయూ పడకలే అందుబాటులో ఉండటం శోచనీయం. ఈ దేశాల్లోని 90 శాతం ఆసుపత్రుల్లో మందులు, అత్యవసర పరికరాల కొరత తీవ్రంగా ఉందని పలు ప్రభుత్వేతర సంస్థలు వాపోతున్నాయి.
ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 25 లక్షలకు చేరువలో కేసులు