నైజీరియాలో ఓ పడవ నదిలో మునిగిపోయిన ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. మరో 83 మంది గల్లంతయ్యారు. వారంతా కూడా చనిపోయి ఉంటారని అధికారులు అంచనాకు వచ్చారు. దేశ వాయువ్య ప్రాంతంలోని కెబ్బీ రాష్ట్రంలోని వర పట్టణానికి సమీపంలో నైజర్ నదిపై ఆ పడవ 160 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న సమయంలో ఓ వస్తువును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా బద్ధలై మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 60 మృతదేహాలను వెలికి తీసినట్లు కెబ్బీ రాష్ట్ర అత్యవసర సేవల సంస్థ ఛైర్మన్ శానీ డొడోడో తెలిపారు. నైజీరియాలోనే అతిపెద్ద నది అయిన నైజర్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఎదురవుతోంది.
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అధ్వానంగా ఉండే పడవలు, నదీ జలాల్లో మట్టి పేరుకుపోయి దిబ్బలుగా ఏర్పడటంతో వాటిని పడవలు ఢీ కొడుతుండటం తదితర కారణాల వల్ల నైజర్‌పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి: గల్లంతైన ఆ నౌకలో 37కు చేరిన మృతులు