ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఎర్ర సముద్ర తీర నగరం ఐన్ సోఖ్నా రిసార్ట్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో 16 మంది భారతీయ పర్యటకులు ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది. రెండు బస్సులు.. ఓ ట్రక్కును ఒకదాని వెంట ఒకటి ఢీ కొట్టాయి.
ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా వారిలో ఓ భారతీయుడు ఉన్నాడు. ఇద్దరు మలేషియాన్లు, ముగ్గురు ఈజిప్టియన్లు (డ్రైవర్, టూరిస్ట్ గైడ్, భద్రతా సిబ్బంది) ఉన్నారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో చాలా మంది పర్యటకులే ఉన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భారతీయ దౌత్య కార్యాలయం ట్వీట్..
భారతీయ పర్యటకుల బస్సు ప్రమాదంపై ఈజిప్ట్‌లోని భారత దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. గాయపడిన వారిని సూయెజ్, కైరోలోని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించింది. హెల్ప్‌లైన్ కోసం ఫోన్ నంబర్లు +20-1211299905, +20-1283487779 అందుబాటులో ఉంచింది.
మరో ప్రమాదంలో 22 మంది మృతి
పర్యటకులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైన కొన్ని గంటల్లోనే ఉత్తర ఈజిప్ట్‌లోని పోర్ట్‌సైడ్, డామిట్టా నగరాల మధ్య మరో ఘోర ప్రమాదం జరిగింది. వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికులతో వెళుతోన్న బస్సు ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది పురుషులు సహా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అస్తవ్యస్తంగా రోడ్లే కారణం..
ఈజిప్ట్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2018లో 8,480 రోడ్డు ప్రమాదాలు జరగగా 3,087 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో 11,098 ప్రమాదాలు జరగగా 3,747 మంది చనిపోయారు.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. కోలా బేర్ మనుగడకు ముప్పు?