ఎబోలా... ఆఫ్రికా దేశాలను వణికిస్తోన్న ప్రమాదకర వ్యాధి. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య రోజురోజకూ పెరుగుతోంది. 10 నెలల క్రితం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వెలుగుచూసిన ఈ వ్యాధి ఇప్పటి వరకూ 1,346 మందిని బలితీసుకుంది.
మొత్తం 2,008 ఎబోలా కేసులు నమోదు కాగా అందులో 539 మంది కోలుకున్నట్లు తెలిపింది ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత కొద్ది వారాలుగా ఎబోలా కేసులు విస్తృతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోందని కాంగో తెలిపింది.
ఎబోలా బాధితులకు చికిత్స అందించేందుకు వెళ్తున్న అంతర్జాతీయ వైద్య బృందాలకు అక్కడి ఉగ్రవాదుల నుంచి తీవ్రప్రతిఘటన ఎదురవుతోంది. గత ఆగస్టులో తూర్పు కాంగోలోని ఉత్తర కివు రాష్ట్రంలో తొలికేసు నమోదైంది. ఈ 10 నెలల వ్యవధిలో దాదాపు 1000 మందిని చుట్టేసిన ఎబోలా.. పక్కదేశాలకు వ్యాపించలేదు.
1976లో మొట్టమొదటిసారి ఎబోలా వైరస్ వెలుగుచూడగా.. అప్పటి నుంచి అప్పుడప్పుడూ పంజా విసురుతూనే ఉంది. గత ఆగస్టుతో కలిపి కాంగోలో ఇప్పటికే 10 సార్లు ఎబోలా వెలుగుచూసింది . 2014-16 మధ్య కాలంలో 3 దేశాల్లో దాదాపు 11,300 మందిని ఎబోలా కబళించింది.
- ఇదీ చూడండి: 'బ్రెగ్జిట్ తరువాత మెరుగైన వాణిజ్య ఒప్పందం'