మీరు ఇప్పటివరకు ఎన్నో హెయిర్‌స్టైల్స్ చూసి ఉంటారు. కానీ, కెన్యాలోని షరోన్ రెఫా వేసే 'కరోనా' హెయిర్‌స్టైల్ మాత్రం ఎక్కడా చూసి ఉండరు!
షరోన్ రెఫా.. నైరోబీ సమీపంలో కిబేరాలోని చిన్న బస్తీలో నివాసముంటుంది. సంప్రదాయ కెన్యా జడలు అల్లడంలో రెఫాకు రెఫాయే సాటి. అయితే, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తనవంతు సాయం చేయాలనుకుంది రెఫా. తనకు వచ్చిన విద్యతోనే చిన్నపిల్లలకు కరోనా జడ వేసి.. ప్రజల్లో వైరస్ పట్ల అవగాహన కల్పిస్తోంది.
"చిన్నపిల్లలే చేతులు శుభ్రంగా ఉంచుకుంటున్నారు. కానీ, అన్నీ తెలిసిన పెద్దవాళ్లు మాత్రం కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించట్లేదు. అందుకే, వారికి అర్థం కావడానికే నేను ఈ కరోనా జడ ఆలోచనతో ముందుకొచ్చాను."
-షరోన్ రెఫా
ఈ కరోనా హెయిర్ స్టైల్‌కు అయ్యే ఖర్చు కూడా తక్కువే. కేవలం 50 షిల్లింగ్లు(సుమారు రూ.35) తీసుకుని ఈ హెయిర్ స్టైల్ వేస్తుంది రెఫా. కరోనా కొమ్ముల జడలు తమ చిన్నారుల తలలపై భలే అందంగా ఉన్నాయని మురిసిపోతున్నారు తల్లిదండ్రులు.
ఇప్పటి వరకు కెన్యాలో దాదాపు 600కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది కరోనా బారినపడి మృతి చెందారు.
ఇదీ చదవండి:కరోనాను జయించిన 20రోజుల పసికందు