ప్రపంచంలోని మూడో అతిపెద్ద వజ్రం.. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానాలో బయటపడింది. 1,098.3 క్యారెట్లతో ఉన్న ఈ వజ్రాన్ని ఈ నెల ప్రారంభంలో జవానెంగ్ అనే గనిలో డెబ్స్వానా అనే డైమండ్ కంపెనీ కనుగొంది. 73 మిల్లీమీటర్ల పొడవు, 52 మిల్లీమీటర్ల వెడల్పు, 27 మిల్లీమీటర్ల మందంతో ఈ వజ్రం ఉందని ఆ సంస్థ తెలిపింది. గత 50 ఏళ్లలో తమకు దొరికిన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని డెబ్స్వానా తాత్కాలిక డైరెక్టర్ లైనెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ తెలిపారు. ప్రాథమిక విశ్లేషణ తర్వాత దీనిని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రంగా భావిస్తున్నామని చెప్పారు. దీనిని ఆ దేశ అధ్యక్షుడు మాక్గ్వీట్సీకి అప్పగించినట్లు వెల్లడించారు.
ఫుల్ ఇన్కమ్!
డెబ్స్వానా డైమండ్ సంస్థను బోట్స్వానా ప్రభుత్వంతో పాటు డి బీర్స్ గ్రూప్ సంస్థ నిర్వహిస్తోంది. 1969 నుంచి బోట్స్వానాలో డెబ్స్వానా సంస్థ వజ్రాల వెలికితీత చేపడుతోంది. 1993లో 446 క్యారెట్లతో ఉన్న పెద్ద వజ్రాన్ని ఈ సంస్థ కనుగొంది. కొవిడ్ మహమ్మారి విజృంభణతో అతలాకుతలమైపోయిన బోట్స్వానా ఆర్థిక వ్యవస్థకు ఈ వజ్రం దొరకటం శుభ పరిణామమని నిపుణులు భావిస్తున్నారు. ఈ వజ్రం ద్వారా ఆ దేశ ఎగుమతుల్లో 2/3 వంతుకు సమానమైన ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు.
మూడూ ఆఫ్రికాలోనే..
గతంలో దొరికిన అతిపెద్ద వజ్రాలలో మొదటి రెండు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. మొదటి అతిపెద్ద 3,106 క్యారెట్ల వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. దీనికి కుల్లినన్ డైమండ్ అని పేరు పెట్టారు. 2015లో బోట్స్వానాలో లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల 'లెసెడి లా రోనా' అనే రెండో అతిపెద్ద వజ్రాన్ని వెలికి తీసింది. అయితే.. డెబ్స్వానా సంస్థ తాజాగా వెలికితీసిన ఈ వజ్రానికి ఇంకా పేరు పెట్టలేదు.
ఇదీ చూడండి: diamond: పుడమి పుత్రుడు.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు!
ఇదీ చూడండి: దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని ఇదే...