సూడాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైనిక విమానం కుప్పకూలిన (Plane Crash) ఘటనలో ఆ దేశానికి చెందిన ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణాన ఉన్న వైట్ నైల్ నదీ ప్రాంతంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఓ లెఫ్టినెంట్ కల్నల్ సహా ముగ్గురి మృతదేహాలు.. ఘటనాస్థలిలో లభ్యమయ్యాయని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు.
బలహీనమైన వైమానిక వ్యవస్థ కారణంగా సూడాన్‌లో విమానాలు ప్రమాదానికి గురికావడం.. సాధారణంగా మారిపోయింది. జనవరిలో ఇదే తరహాలో ఆయుధాలతో బయల్దేరిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. గతేడాది జనవరిలో జరిగిన మరో విమాన ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003లో జరిగిన మరో ఘటనలో 116 మంది చనిపోయారు.
ఇదీ చూడండి: 9/11 Attack: విధ్వంస కాండకు 20 ఏళ్లు.. ఇంకా మానని గాయాలు