ఆఫ్రికా దేశం నైజర్‌లో బొకో హారమ్ తీవ్రవాదులు చేసిన దాడిలో 28 మంది పౌరులు మరణించారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దేశానికి దక్షిణాన ఉన్న టౌమర్ గ్రామంలోని మార్కెట్ సహా ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారని తెలిపింది. పారిపోయేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపారని పేర్కొంది. శనివారం రాత్రి ప్రారంభమై.. ఆదివారం వరకు ఈ మారణకాండ కొనసాగిందని వివరించింది. కాల్పుల్లో కొంత మంది మరణించగా.. పారిపోయేందుకు ప్రయత్నించి నదిలో మునిగిపోయి మరికొందరు మరణించారని ప్రభుత్వం తెలిపింది.
డిఫ్ఫా గవర్నర్ ఇస్సా లెమినీ దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. వందలాది మంది నిరాశ్రయులు కావడం, పలువురు మరణించడం అత్యంత దారుణమని అన్నారు. సమీప ప్రాంత ప్రజలు అక్కడి నుంచి పారిపోయారని, దగ్గర్లోని గ్రామాల్లో తలదాచుకుంటున్నారని చెప్పారు.
ఘటన నేపథ్యంలో దేశంలో 72 గంటల పాటు సంతాప గడియలు పాటించనున్నట్లు నైజర్ ప్రభుత్వం తెలిపింది.
ఖండించిన ఐరాస
ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. డిఫ్ఫా ప్రాంతంలో శాంతియుతంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ దాడి విఘాతం కలిగించిందన్నారు.
నైజర్‌లో ఆదివారం దాదాపు 220 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మరో రెండు వారాల్లో చట్టసభలతో పాటు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.