సూడాన్ రాజధాని ఖర్టౌమ్లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఎదుట కొంతకాలంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు.
సూడాన్ ప్రధాని ఒమర్ అల్ బాషిర్ సుదీర్ఘ పాలనకు తెరదించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. నగర వ్యాప్తంగా పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించడం సహా.... ప్రజా రవాణాను అధికారులు నిలిపివేశారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న నిరసనల్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల వల్ల హింస చెలరేగింది. మరోవైపు.. ఈ ఘటనను పలు దేశాలు ఖండించాయి. ఆందోళనకారులపై సైనికులు జరిపిన కాల్పులు పాశవికమని అమెరికా పేర్కొంది.
ఆందోళనకారులపై భద్రతా దళాల విచ్చలవిడి వాడకాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. అయితే నిరసనకారులపై హింసకు పాల్పడలేదని, వారి ఆందోళనలను భగ్నం చేయలేదని సూడాన్ మిలిటరీ కౌన్సిల్ ప్రకటించింది.