మేడ్చల్ జిల్లా గాజుల రామారం 125 డివిజన్ బాలయ్యనగర్ బస్తీ, రావినారాయణరెడ్డి నగర్, కైసర్‌నగర్‌లో తెరాస అభ్యర్థి రావుల శేషగిరికు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. బస్తీ వాసులంతా ఏకగ్రీవ తీర్మానం చేసి... కాపీని మంత్రికి అందజేశారు.
బస్తీవాసులను చూస్తే చాలా సంతోషం కలుగుతోందని మంత్రి వేముల పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఎల్లప్పుడు బస్తీకి అందుబాటులో ఉంటారని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం పేదల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని పేర్కొన్నారు. మంత్రి కేటిఆర్ పట్టణ అభివృద్ధి కోసం నిర్విరామంగా కష్టపడుతున్నారని వెల్లడించారు. ఎన్నికలప్పుడు చాలా మంది వచ్చి కనిపిస్తారు.. ఓట్లు అడుగుతారు.. కానీ మనకు ఆపదలో వచ్చేవారు ఎవరో ఆలోచన చేయాలని సూచించారు. భాజపా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్కార్ అమలు చేసే పథకాలు ఉండవని తెలిపారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. భాజపా, కాంగ్రెస్ వాళ్లు వచ్చి మాయమాటలు చెప్తారు.. నమ్మవద్దని కోరారు. మొన్న వరదలు వస్తే నడుము లోతు నీళ్లతో తిరిగింది ధైర్యం చెప్పింది మన కేటీఆర్ అని గుర్తు చేశారు. వరదసాయం పదివేలు ఇస్తుంటే అడ్డుకున్నది భాజపా,కాంగ్రెస్ అని అన్నారు. వాళ్లకు పేదలకు మంచి చేయడం రాదు.. చేస్తే చేయనీయరని మండిపడ్డారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ... ప్రజల కోసం కృషి చేసే తెరాసకు ఓటువేసి గెలిపించాలని కోరారు.
- ఇదీ చూడండి: మోదీపైనే ఛార్జిషీట్ వేయాలి: కేటీఆర్