మతం కాదు జనహితం తమకు ముఖ్యమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. గ్రేటర్ పోరులో గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్న కేటీఆర్.. రోడ్‌షోలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ చౌరస్తా, మల్లాపూర్, చిలుకానగర్, రామంతపూర్‌లో జరిగిన రోడ్‌షోల్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో ప్రచారానికి వచ్చే కేంద్రమంత్రులు.. సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన వరద సహాయం తీసుకురావాలని కేటీఆర్ అన్నారు. భాజపావన్నీ అబద్ధపు హామీలని అరోపించిన కేటీఆర్.. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షల పేరిట ప్రజల్ని మోసపుచ్చారని విమర్శించారు. ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చివేస్తామన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సహా భాజపా నేతలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు
విశ్వనగరం నినాదంతో తాము ముందుకెళ్తే.. విద్వేషనగరం నినాదంతో భాజపా వెళ్తోందని కేటీఆర్ విమర్శించారు. అన్నిరంగాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తెరాసదేనని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అన్నిఏర్పాట్లు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లతో సహా అన్ని హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలకు మోసపోకుండా తెరాసకే పట్టం కట్టాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 'ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'