గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవటంతో కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోదావరి నీటి తరలింపు వరకు..అన్ని పనులు జరిగాయని ప్రజలకు వివరించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బంజారాహిల్స్ ఎంబీటీ బస్తీ, రాయదుర్గం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా, తెరాస హైదరాబాద్‌కు ఒక్క పైసా ఇవ్వలేదని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. 67వేల కోట్లు నగరాభివృద్ధికి ఖర్చు చేసినట్లు చెబుతున్న మంత్రి కేటీఆర్ దేనికి ఖర్చు చేశారో.. చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించాలని చూస్తున్నారు
ఎంపీ రేవంత్ రెడ్డి వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను చుట్టేస్తున్నారు. శనివారం అంబర్‌పేట, ఉప్పల్, కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్, కూకట్‌పల్లి, అల్లాపూర్ తదితర డివిజన్లలో సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కరోనాతో విలవిలలాడుతున్న ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని.. ఎల్బీ స్టేడియంలో ఎన్నికల మీటింగ్‌కు కార్లు పంపించి, డబ్బులిచ్చి ఆఫ్, ఫుల్ మద్యం పోసి జనాన్ని రప్పించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరద బాధిత కుటుంబాలకు చెందాల్సిన పదివేలల్లో.. తెరాస నాయకులు కమీషన్లు నొక్కేశారని.. పేదల ఉసురు ఊరికే పోదన్నారు. సందట్లో సడేమియా అన్నట్లు భాజపా వాళ్లు దిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి వస్తాద్‌లను రప్పించి ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించి ఓట్లు దండుకోవాలని భాజపా చూస్తోందని ధ్వజమెత్తారు. కర్ఫ్యూ వస్తే నెలల తరబడి ఉంటుందని.. పేదల బతుకులు ఆగమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే.. అద్భుతాలు చేస్తామన్న రేవంత్ రెడ్డి పాతిక ముప్పై మంది కార్పొరేటర్లను ఇస్తే సమస్యల పరిష్కారం కోసం గట్టిగా కొట్లాడతామన్నారు.
ఎమ్మెల్యేల ప్రచారం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చింతల్, కవాడిగూడ డివిజన్లల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం చందానగర్ డివిజన్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎల్బీనగర్ నియోజక వర్గం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: డిసెంబర్ 7తర్వాత రూ.10వేలు పక్కా ఇస్తాం: కేసీఆర్