బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తూ విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్. త్వరలోనే మిలీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షూటింగ్‌కు సంబంధించిన అనుభవాలను తెలిపింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది.
"ఈ చిత్రంలో నేను మిలీ నౌదియార్ (బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి)గా కనిపిస్తా. దర్శకుడు సూచన మేరకు పాత్రకు సెట్ అయ్యేలా 7.5 కేజీల బరువు పెరిగా. ఈ సినిమా విషయంలో శారీరకంగానేకాదు మానసికంగా ఇబ్బంది పడ్డా. నేను పోషించిన పాత్ర (ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టు)కు సంబంధించిన దృశ్యాలు కలలోకి వచ్చేవి. సరిగా నిద్రపట్టేది కాదు. దాంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజులు పెయిన్ కిల్లర్స్ వాడా. నాతోపాటు మా దర్శకుడూ అస్వస్థతకు గురయ్యారు. రోజులో 15 గంటలు ఫ్రీజర్‌లో ఉండాల్సి వస్తే, అక్కడ ఓ ఎలుక మీ వేళ్లను కొరుకుతుంటే ఎలా ఉంటుంది? ఊహించడమే కష్టంగా ఉంది కదా. అలాంటి నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఇది మంచి సినిమా.. విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండాలంటే నిరంతరం పనిచేస్తూనే ఉండాలని మా అమ్మ చెప్పింది. మన పనిని నిజాయతీగా, అవిశ్రాంతంగా చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది నా అనుభవంలో నేర్చుకున్నా. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావటంతో నాపై ఇప్పటికీ విమర్శలు వస్తుంటాయి. 'ప్రతిభలేని' నటి అంటూ వచ్చే కామెంట్లపై పోరాడుతూనే ఉన్నా. దీని గురించి ప్రస్తావించేందుకు నాకు కొంత సమయం పట్టింది. నేను కష్టపడి పనిచేసే అమ్మాయిని. నన్ను నేను నిరూపించుకునేందుకు, నన్ను విమర్శించేవారికి నేనేంటో తెలియజేసేందుకు యుద్ధం చేస్తూనే ఉంటా" అని పేర్కొంది.
కాగా, ఈ చిత్రంలో జాన్వి కపూర్ ఓ నర్సింగ్ గ్రాడ్యుయేట్ పాత్రలో నటించింది. ఈ సినిమాలో భాగంగా ఆమె ఫ్రీజర్‌లో చిక్కుకుని దాని నుంచి బయట పడటానికి ప్రయత్నించే అమ్మాయిగా కనిపించనుంది. దీని కోసం దాదాపు 20 రోజుల పాటు మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫ్రీజర్‌లో, చల్లని, చీకటి ప్రదేశాల్లో సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశం గురించే ఆమె తాజాగా మాట్లాడారు. ఇక ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. సన్నీ కౌశల్, మనోజ్ పవా తదితరులు కీలక పాత్ర పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. నవంబరు 4న చిత్రం విడుదల కానుంది.
ఇదీ చదవండి: ఈ ముద్దుగుమ్మల పరిస్థితేంటి కెరీర్‌కు శుభం కార్డు పడినట్లేనా