''మన దక్షిణాది సినిమాని కమల్‌హాసన్‌కి ముందు, కమల్ తర్వాత అని రెండు భాగాలుగా విభజించొచ్చు. అప్పటిదాకా ఉన్న మూస ధోరణిని ఆయన మార్చారు. ఇలా నటించొచ్చా అని నటులకి, ఇలా చేయొచ్చా అని సాంకేతిక నిపుణుల్లో ఆలోచనని రేకెత్తించారు. ఆయనకి నిజమైన అభిమానినంటే నేనే'' అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేష్. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'విక్రమ్' ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తోంది.
వేడుకని ఉద్దేశించి వెంకటేష్ మాట్లాడుతూ ''కమల్‌హాసన్ నటనకి అరవయ్యేళ్లు. పదహారేళ్ల వయసు తమిళ వెర్షన్‌ని తన కెరీర్ ఆరంభంలో చేశారు. నేనా సినిమా చూసిన తర్వాత క్లీన్‌బౌల్డ్ అయ్యాను. ఆయన ఇంకా పదహారేళ్ల వయసులోనే ఉండిపోయారు. ఆయన నటించిన 'మరోచరిత్ర' ప్రతి నటుడికీ జీపీఎస్‌లాంటిది. 'దశావతారం' లాంటి సినిమా చేయడానికి ఎవ్వరికీ ధైర్యం చాలదు. 'ఏక్ దూజే కే లియే' సినిమాతో తొలి పాన్ ఇండియా స్టార్. ఇప్పుడొక గ్లోబల్‌స్టార్. ఆయన అసాధారణమైన నటుడు. 'గణేశ్', 'ధర్మచక్రం' తరహా సెంటిమెంటల్ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం ఆయన హావభావాల్నే స్ఫూర్తిగా తీసుకుంటుంటా. సుధాకర్‌రెడ్డి, నితిన్ విడుదల చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది'' అన్నారు.
కమల్‌హాసన్ మాట్లాడుతూ ''దాదాపు 45 ఏళ్ల కిందట డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌కి వచ్చా అక్కినేని నాగేశ్వరరావు 'శ్రీమంతుడు' సినిమాకి. అప్పటి నుంచి తెలుగు ఆహారాన్ని తింటున్నా. నా పెద్ద విజయం తెలుగులోనే. వరుసగా నాకు విజయాలు ఇచ్చారు. వెంకటేష్ చెప్పినట్టుగా ఇదంతా నేను ఒంటరిగా చేసింది కాదు. బాలచందర్ నుంచే నేను నటన నేర్చుకున్నా. నా స్టైల్, రజనీకాంత్ స్టైల్, నగేశ్‌గారి స్టైల్ ఆయన నుంచే వచ్చినవే'' అన్నారు.
నితిన్ మాట్లాడుతూ ''ఈ సినిమాని విడుదల చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. భారతీయ సినిమా లెజెండ్, భారతీయ సినిమాకి గర్వకారణమైన నటుడు ఒక్కరే. ఆయనే కమల్‌హాసన్'' అన్నారు. లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ ''నా తొలి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. 'విక్రమ్'లో మరోసారి తన నటనతో గర్జించారు కమల్‌హాసన్'' అన్నారు. అనిరుధ్ మాట్లాడుతూ ''మా అందరికీ 'విక్రమ్' చాలా ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా చూశాక కన్నీళ్లొచ్చాయి. మేం చాలా గర్వపడుతున్నాం ఇందులో భాగమైనందుకు'' అన్నారు.వెంకీ కుడుముల, శైలేష్ కొలను, రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్, బుచ్చిబాబు సానా, హరీష్‌శంకర్, సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి, ఠాగూర్ మధు, రాజ్‌కుమార్, మహేశ్వర్‌రెడ్డి, ఎమ్.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, సునీల్, దేవేంద్రన్, సూరత్‌బాబు, నవరసన్ తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల పాట: నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోని చిల్‌మారో... పాటని ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ విడుదల చేశారు.
''మనకు పాన్ ఇండియా చాలదు. పాన్ వరల్డ్ కావాలి. అది ప్రేక్షకుల సాయం లేకుండా సాధ్యమయ్యేది కాదు. ప్రేక్షకులే మంచి సినిమా ఇవ్వండని అడగాలి. ప్రేక్షకులు అడిగితే ఇవ్వడానికి అందరూ తయారుగా ఉన్నారు. మంచి సినిమా ఇష్టపడుతున్నామని నిరూపించండి. భారతీయ సినిమాల్ని, అంతర్జాతీయ సినిమాల్ని చేయండ''ని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు కమల్‌హాసన్.
ఇదీ చదవండి: SINGER KK: ప్రముఖ సింగర్ కేకే హఠాన్మరణం.. ప్రధాని సంతాపం