Varuntej Gani movie: "వ్యక్తిగతంగా యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నేను నటుడైందీ ఆ తరహా చిత్రాలు చేయడానికే! ‘గని’ చేయడానికి అదీ ఓ కారణమే" అన్నారు వరుణ్‌తేజ్. ఎప్పటిప్పుడు కొత్త రకమైన కథలతో ప్రయాణం చేసే కథానాయకుడిగా పేరున్న వరుణ్... ఇటీవల బాక్సింగ్ నేపథ్యమున్న కథతో చేసిన చిత్రమే ‘గని’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ చిత్ర సంగతులను తెలిపారు.. ఆ విషయాలివీ...
బాక్సింగ్ నేపథ్యం ఆలోచన మీదే అని దర్శకనిర్మాతలు చెప్పారు. దానిపై అంత మక్కువ ఎందుకు?
హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తుంటా. అక్కడ బేస్ బాల్, బాస్కెట్ బాల్ నేపథ్యంలో సినిమాలొస్తుంటాయి. హిందీలోనూ స్పోర్ట్స్ డ్రామాలు చాలా బాగుంటాయి. బాబాయ్ ఇదివరకు ‘తమ్ముడు’ సినిమా చేశారు. శ్రీహరి నటించిన ‘భద్రాచలం’ చాలాసార్లు టీవీల్లో చూశా. ఇవన్నీ నాకు బాగా నచ్చుతుంటాయి. ఈ సమయంలో మన ప్రేక్షకులకూ కొత్తగా ఉంటుందనేది నా ఆలోచన. దర్శకుడు కిరణ్‌కి, నిర్మాతలకీ నా ఆలోచన నచ్చి ‘గని’ కథని సిద్ధం చేశారు.
‘గని’ ఎలా ఉండనుంది? పాన్ ఇండియా లక్ష్యంగా చేశారా?
సునీల్‌శెట్టి, ఉపేంద్ర, సయీ మంజ్రేకర్... తదితర తారాగణాన్ని చూసి చాలా మంది ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు అనుకోవచ్చు. పాత్రలు అలాంటి నటుల్ని కోరుకున్నాయి తప్ప, ఇది పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేసిన సినిమా కాదు. రాకీ సిరీస్‌లో 8 భాగాలు ఉంటాయి. ఆ సిరీస్‌ని దర్శకుడు చూశాడో లేదో తెలియదు కానీ, ఒక బాక్సర్ జీవితంలో వచ్చే సమస్యలు, భావోద్వేగాలన్నీ అందులో కనిపిస్తాయి. అలాంటివన్నీ ఉన్న మరో మంచి కథ ‘గని’. విడుదల తేదీని ముందే అనుకుని రంగంలోకి దిగాం. కరోనాతో ప్రణాళికలన్నీ తారుమయ్యాయి. ఎప్పుడూ అసహనమైతే కలగలేదు కానీ, సినిమా చేశాం కదా, అందరికీ చూపిస్తే ఓ పనైపోతుందనిపించేది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీనియర్ నటులతో కలిసి పనిచేశారు. ఆ అనుభవం ఎలాంటిది?
ఉపేంద్ర తన సినిమాల్లో రెబల్‌గా కనిపిస్తుంటారు. వ్యక్తిగతంగా ఆయన చాలా సున్నితం. సెట్లో అందరితో చాలా మర్యాదగా మాట్లాడుతుంటారు. సునీల్‌శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర... ఇలా అందరూ మంచి పాత్రల్లో కనిపిస్తారు. ‘మిస్టర్’ సినిమా సమయంలో సహ దర్శకుడిగా నాకు కిరణ్ కొర్రపాటి పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి మా ఇద్దరి ఆలోచనలు ఒకలాగే అనిపించేవి. తను ఈ కథని మలిచిన తీరు చాలా బాగుంటుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాని అర్థం చేసుకున్న విధానం మాకు మేలు చేసింది. తనకున్న పది సినిమాల్లో ఒకటని కాకుండా, ప్రత్యేకంగా పరిశోధన చేసి బాణీలు సమకూర్చాడు.
కొత్తగా ఒప్పుకొన్న ప్రాజెక్టులేంటి?
‘ఎఫ్3’ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సినిమానే. అది మొదలవుతుంది. నాకు నచ్చిన యాక్షన్ కథతోనే ఆ సినిమా రూపొందుతోంది.
క్రీడా నేపథ్యంలో సాగే కథల్లో నటించడం సులభం అంటారా? కష్టమంటారా?
సినిమా అంటే ఇష్టం కాబట్టి ఎప్పుడూ కష్టం అనిపించలేదు. అయితే మిగతా వాటితో పోలిస్తే ఈ నేపథ్యం వెనక కష్టం ఉంటుంది. కథ రీత్యా ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తా. తొలి సగభాగంలో లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల కలిగిన ఓ మొండి కుర్రాడిగా కనిపిస్తా. పట్టుదల ఉన్నా, సరైన మార్గ నిర్దేశకత్వం ఉండదు. ద్వితీయార్ధంలో మార్గనిర్దేశకత్వంలో ప్రయాణం చేసే కుర్రాడిగా కనిపిస్తా. ఈ రెండు కోణాల్లో వైవిధ్యం కనిపించేలా నటించా. ‘గద్దలకొండ గణేష్’ సమయంలోనే ఈ సినిమా కోసం అమెరికా వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నా. సినిమాతోనే క్రమశిక్షణ వస్తుందని నమ్మేవాణ్ని నేను. అదృష్టవశాత్తూ ‘గని’ సినిమా నాలో మరింత క్రమశిక్షణ అలవడేలా చేసింది. బద్దకం అని కాదు కానీ, ఇదివరకు ‘ఈ సినిమాకి ఇది చాల్లే’ అనుకునేవాణ్ని. ‘గని’ తర్వాత ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుందని అర్థమైంది.
మల్టీస్టారర్ సినిమాల జోరు పెరుగుతోంది. వెంకటేష్‌తో మీరూ కలిసి సినిమాలు చేశారు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే ఎవరితో నటించడానికి ఇష్టపడతారు?
మా బావ సాయి తేజ్‌తోనూ, నితిన్‌తోనూ నాకు మంచి సాన్నిహిత్యం ఉంటుంది. నేను, తేజ్ చిన్నప్పట్నుంచి కలిసి తిరిగాం. నితిన్‌తో నాకు స్నేహం ఉంది. ఆ ఇద్దరిలో ఎవరితోనైనా కలిసి నటిస్తా. పెదనాన్న, బాబాయ్‌లతోనూ నటించాలని ఎప్పుడూ ఉంటుంది. కానీ కథలే కీలకం కదా.
ఇదీ చూడండి: చిరంజీవి 'గాడ్ ఫాదర్' రిలీజ్ అప్పుడే? పవన్ కోసం టీమ్ వెయిటింగ్!