Ustaad Bhagat Singh Villain : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో ప్రతి నాయకుడు ఎవరనేది ఇంతవరకు తెలియలేదు. మూవీటీమ్ కూడా ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ ఎదుర్కోబోయేది ఎవరనేది బయట కథనాలు వస్తున్నాయి.
వాస్తవానికి ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఒరిజినల్ వెర్షన్ తేరి అని అప్పట్లో ప్రచారం సాగింది. దీనిపై దర్శకుడు హరీశ్‌ను అడిగినప్పటికీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఆ ఒరిజినల్ సినిమాలో ప్రతినాయకుడిగా మహేంద్రన్ అద్భుతంగా నటించారు. ఇకపోతే గతంలోనూ ఓ సారి ఉస్తాద్‌లో ప్రతినాయకుడి పాత్ర కోసం తనను అడిగారంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఓ సందర్భంలో చెప్పారు. ఇది నిజమో కాదో పక్కనపెడితే... సినిమాలో ప్రతినాయకడి పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది సమాచారం మాత్రం బయటకు రాలేదు.
అయితే తాజాగా ఆ విలన్ రోల్లో ఎవరు నటిస్తున్నారో దాదాపు ఖరారు అయినట్లుగా సమాచారం అందింది. అప్పుడు గబ్బర్ సింగ్ కోసం ఫ్రెష్ ఫేస్ అభిమన్యు సింగ్‌ను తీసుకొచ్చారు హరీశ్ శంకర్. అలానే ఈ సారి కూడా ఉస్తాద్ కోసం తీసుకున్నారట. తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్ పార్తీబన్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఆయన దర్శకుడిగా, నటుడిగా మూడు దశాబ్దాల నుంచి కెరీర్లో రాణిస్తున్నారు.
తెలుగులో ఈయన అప్పట్లో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో అలా కాసేపు కనిపించారు. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మాత్రమే. అయితే ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ అని తెలిసింది. హరీశ్ శంకర్ ఆయన పాత్ర బాగా డిజైన్ చేశారట. వాస్తవానికి డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి.. పార్తీబన్ సుపరిచిత నటుడే. ఇటీవలే ఆయన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లోనూ ఓ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికొస్తే.. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల, సాక్షి వైద్య కథనాయికలుగా నటిస్తున్నారు. పోలీస్ డ్రామాగా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వీలైతే సంక్రాంతికి లేదా ఆ తర్వాత చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తోంది.
PawanKalyan Ustaad : 'ఉస్తాద్' అదిరిపోయే అప్డేట్.. ఊహించని లుక్‌లో పవన్..