Tollywood Producers Meeting: నెలల తరబడి సినిమా షూటింగ్స్ నిలిపివేసే ఉద్దేశం లేదని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది. కరోనా తర్వాత నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు షూటింగ్స్‌ను నిలిపివేసినట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు. మరో వారం పదిరోజుల్లో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని, నిర్మాతలెవరూ బయట జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు దిల్‌రాజు, దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గత నాలుగు రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిణామాలపై చర్చించారు. నిర్మాతల మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని పేర్కొన్న సి.కళ్యాణ్.. నిర్మాత దిల్రాజును వ్యక్తిగతంగా విమర్శించడం తగదని హితవు పలికారు.
నిర్మాతలకు ఎదురవుతున్న సమస్యలపై నాలుగు కమిటీలు ఏర్పాటు చేసినట్లు దిల్ రాజు తెలిపారు. "ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలు, కార్మికుల వేతనాలు, నిర్మాణ వ్యయాలపై ఆయా కమిటీలు పనిచేస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో చర్చించే అంశాలు కూడా ఛాంబర్ అనుమతితోనే తుది నిర్ణయం ఉంటుంది. నిర్మాతలంతా కలిసి తనకు ఎక్కువ బాధ్యతలు అప్పగించారు. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదు" అని దిల్‌రాజు పేర్కొన్నారు
మంచు విష్ణుతో దిల్‌రాజు భేటీ.. అంతకుముందు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును నిర్మాత దిల్‌రాజు కలిశారు. మంచు విష్ణు కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజు ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తమ సినిమాల్లో 'మా' సభ్యులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని, అలాగే, కొత్తవారు 'మా'లో భాగమయ్యేలా ప్రోత్సహించాలని దిల్ రాజును విష్ణు కోరారు. ఈ మేరకు 'మా' సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్‌రాజుకు అందించారు. 'మా' సభ్యులకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టాలీవుడ్ నిర్మాతలను విష్ణు ఇకపై కలవనున్నారు. ఇందులో భాగంగా దిల్‌రాజుతో భేటీ అయ్యారు.
ఇవీ చదవండి: సినిమా షూటింగ్‌ల బంద్‌పై.. నిర్మాతలు ఏం నిర్ణయించారంటే?
ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై 50రోజుల తర్వాతే