Old Telegu movie heroines: ఒకప్పుడు అగ్రకథా నాయికలుగా స్టార్ హీరోల పక్కన నటించిన కొందరు నటీమణులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లకి అమ్మలుగా తెరమీద కొచ్చారు. ఆధునిక అమ్మ పాత్రలకి కేరాఫ్‌గా నిలిచిన కొందరు తారలపై ప్రత్యేక కథనం మీకోసం.
అమ్మగా మరోకోణం: కథానాయికగా నటిస్తూనే 'నరసింహ'లో నీలాంబరిగా నెగెటివ్ పాత్ర పోషించి పెద్ద ప్రయోగమే చేసింది రమ్యకృష్ణ. ఆ తరవాత 2005లో 'నా అల్లుడు'లో తొలిసారి అమ్మ రోల్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చిన్నా చితకా చిత్రాల్లోనూ నటించింది. నా మాటే శాసనం అంటూ 'బాహుబలి'లో శివగామి పాత్రలో తన నటనా విశ్వరూపాన్ని చూపింది. ఆ తరవాత వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా', 'హలో', 'శైలజారెడ్డి అల్లుడు', 'రిపబ్లిక్', 'రొమాంటిక్', 'బంగార్రాజు'లోనూ పవర్‌ఫుల్ అమ్మగా తనదైన ముద్రవేసిన రమ్యకృష్ణ 'లైగర్'లోనూ సందడి చేయబోతోంది.
బన్నీకి అమ్మగా: 'కూలీ నెం.1', 'నిన్నేపెళ్లాడతా', 'చెన్నకేశవరెడ్డి', 'పాండురంగడు', 'అందరివాడు' తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన టబు స్టార్‌హీరోలకు సరిజోడీ అనిపించుకుంది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. సినిమాల్లోనూ, వెబ్‌సిరీస్‌ల్లోనూ దూసుకుపోతున్న టబు 'అల వైకుంఠపురంలో' అల్లు అర్జున్‌కి అమ్మగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్న టబు డైలాగులకు ఎంతోమంది ఫిదా అయ్యారు.
అజ్ఞాతవాసితో మొదలు: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఖుష్బూ. పలు టీవీ షోల్లోనూ ధారావాహికల్లోనూ చేసింది. ఇప్పటికీ చేస్తోంది కూడా. టాలీవుడ్‌లో 'కలియుగపాండవులు'తో మొదలుపెట్టి 'కెప్టెన్ నాగార్జున', 'కిరాయి దాదా', 'పేకాట పాపారావు' వంటి పలు సినిమాల్లో ఆకట్టుకున్న ఈ నటి కొంత కాలం విరామం తీసుకుంది. 'స్టాలిన్'లో చిరంజీవికి అక్కగా మెరిసి సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఆ తరవాత 'యమదొంగ', 'కథానాయకుడు'లో చిన్న పాత్రలు చేసిన ఖుష్బూ 'అజ్ఞాతవాసి'లో పవన్‌కల్యాణ్ పిన్నిగా, 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లో రష్మికకు అమ్మగా కనిపించింది.
ఆరేళ్ల విరామం: ప్రేమ పావురాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన నటి భాగ్యశ్రీ. చేతినిండా అవకాశాలు ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త హిమాలయ దాసానిని పెళ్లి చేసుకుంది. తరవాత కూడా కొంత కాలం హీరోయిన్‌గా నటించింది. తెలుగులో 'ఓంకారం', 'యువరత్న' వంటి చిత్రాల్లోనూ చేసింది. 2013 తరవాత వెండి తెరకు దూరమైన భాగ్యశ్రీ ఆరేళ్ల తరవాత ఓ కన్నడ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 'తలైవి'లో కంగనకూ, రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కూ తల్లిగా ఆకట్టుకుంది ఈ అందాల నటి.
ఆధునిక అమ్మ: మోడ్రన్ అమ్మా, అత్తా పాత్రలకు నదియా పెట్టింది పేరు. 'మిర్చి', 'అత్తారింటికి దారేది', 'అ...ఆ', 'దృశ్యం'... తాజాగా విడుదలైన 'గని'లోని పాత్రలే అందుకు నిదర్శనం. ముంబయిలో పుట్టి పెరిగి పలు భాషల్లో నటించిన నదియా తెలుగులో 'కిరాయి రౌడీ'లో హీరోయిన్‌గానూ నటించింది. ఆమె మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త శిరీష్ గోడ్‌బోలెను వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక వారి ఆలనాపాలనకే పరిమితమైంది. కొంత కాలానికి ఇండియాకి తిరిగొచ్చాక 2004లో మళ్లీ వెండితెరమీదకొచ్చింది. 2013లో 'మిర్చి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాత్రలతో దూసుకుపోతోంది.
ఇదీ చూడండి: అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డు.. వరల్డ్‌లో టాప్-3గా ఘనత!