కొత్త ఏడాది ప్రారంభం రోజున తన కొత్త సినిమాని ప్రకటించనున్నారు నాని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కనున్న 30వ చిత్రమది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), డా.విజయేందర్‌రెడ్డి తీగల, మూర్తి.కె.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడు నాని సరసన కథానాయికగా మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్టు తెలిసింది. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కథానాయిక మృణాల్. సీతామహాలక్ష్మి పాత్రలో ఆమె అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకుంది. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జనవరి 1న నాని 30వ సినిమా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. నాని ప్రస్తుతం 'దసరా' చిత్రంలో నటిస్తున్నారు.
విడుదల రిపబ్లిక్ డేకి
సుధీర్‌బాబు కథానాయకుడిగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించారు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రీకరణతోపాటు, నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. నిర్మాత మాట్లాడుతూ "శక్తిమంతమైన కథతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా ఉంటాయి. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకి పనిచేసిన రేడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ నేతృత్వంలో తీర్చిదిద్దిన యాక్షన్ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాపతో పైలం.. పాటకి మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు. మైమ్ గోపి, కబీర్ దుహాన్ సింగ్, మౌనికరెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్ర శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.
శివకార్తికేయన్ తెలుగు చిత్రం?
తమిళ అనువాద చిత్రాలు, ద్విభాషా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ కథానాయకుడు శివకార్తికేయన్. విజయ్‌తో 'వారిసు' చిత్రాన్ని నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి తమిళంలో మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ జరిగినట్లు సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్‌కు సమయం పట్టేలా ఉందట. ఎందుకంటే శివ కార్తికేయన్ చేయాల్సిన సినిమాలు సంఖ్య ఎక్కువగానే ఉంది. అవి పూర్తయ్యాకా ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.
ప్రేమకథ మొదలైంది
లోకేశ్ ముత్తుముల, దీపికా వేమిరెడ్డి జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. జానీ బాషా దర్శకుడు. పార్థురెడ్డి నిర్మాత. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. "యువతరం జీవితాల్ని ప్రతిబింబిస్తూ, ఓ ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. త్వరలోనే పేరుని ప్రకటిస్తామ"అని సినీ వర్గాలు తెలిపాయి.
వచ్చినవాడే గౌతం
అశ్విన్‌బాబు, పాలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వచ్చినవాడు గౌతం'. ఎం.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డి.ఎస్.రావు నిర్మాత. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ క్లాప్‌నిచ్చారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్, ఎ.ఎస్.రవికుమార్, వి.సముద్ర, రాజా రవీంద్ర తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ "చాలా రోజుల విరామం తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. మెడికో థ్రిల్లర్ కథతో రూపొందుతోంది. కథానాయకుడు అశ్విన్‌బాబుని కొత్త కోణంలో చూపించనున్నారు దర్శకుడు. జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతాం. ఇక నుంచి మంచి కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాల్ని తీయడానికి సిద్ధమయ్యా. త్వరలోనే మరో యువ హీరోతో సినిమా చేస్తున్నా" అన్నారు. నాజర్, అచ్యుత్, ఆర్.జె.హేమంత్, సంధ్యా జనక్, మాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యాం కె.నాయుడు, సంగీతం: హరి గౌర.