Naga Chaitanya custody film review : ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా ఏడాదికి అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు అక్కినేని నాగచైతన్య. గతేడాది రిలీజైన 'థ్యాంక్యూ', 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. దీంతో ఈసారి తమిళ దర్శకుడితో కలిసి ఓ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైవిధ్య కథలతో ప్రేక్షకులను అలరించే వెంకట్ ప్రభు తెరకెక్కించిన 'కస్టడీ' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది? పోలీస్ కానిస్టేబుల్ శివగా నాగచైతన్య ఎలా నటించారు? ఇంతకీ ఈ 'కస్టడీ' కథ ఏంటి?
కథేంటంటే: ఎ.శివ (నాగచైతన్య) ఓ నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్. అతను సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిసుంటాడు. తనకు రేవతి (కృతి శెట్టి) అంటే ఎంతో ప్రాణం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచే ఆమెను ప్రేమిస్తుంటాడు. కానీ ఆ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కిద్దామనుకుంటే కులాలు వేరు కావడం వల్ల ఆమె తండ్రి అడ్డు చెబుతాడు. అంతే కాకుండా రేవతికి బలవంతంగా ప్రేమ్ (వెన్నెల కిషోర్)తో పెళ్లి నిశ్చయం చేస్తాడు. దీంతో ఆమె శివతో వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. అయితే తన కోసమే శివ వాళ్లింటికి వెళ్తుంటే దారిలో అనుకోకుండా ఓ కారు అతన్ని ఢీ కొడుతుంది. అందులో కరుడుగట్టిన నేరస్థుడు రాజు (అరవింద్ స్వామి), సీబీఐ అధికారి జార్జ్ (సంపత్ రాజ్) గొడవ పడుతుంటారు. ఇక వాళ్లిద్దరిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేసి స్టేషన్‌లో పెడతాడు శివ. అయితే ముఖ్యమంత్రి దాక్షాయని (ప్రియమణి) ఆదేశాల ప్రకారం స్టేషన్‌లో ఉన్న రాజును చంపేందుకు పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) రంగంలోకి దిగుతాడు. తన పోలీస్ బలగాన్ని.. మరికొందరు రౌడీ మూకను జత చేసుకొని రాజు ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజును చంపమని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించింది? అతన్ని పోలీస్‌స్టేషన్ నుంచి ప్రాణాలతో రక్షించిన శివ బెంగళూరుకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటాడు? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? శివకు రాజుకు ఉన్న సంబంధం ఏంటి? రేవతి-శివ ప్రేమ కథ ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: ఇది ఒక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. విలన్‌ను ప్రాణాలతో కాపాడుకుంటూ.. అడ్డొచ్చిన పోలీస్ వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడుతూ.. ఓ సాధారణ కానిస్టేబుల్ చేసే అసాధారణ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. అందులో ఓ చిన్న ప్రేమకథను.. కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్‌ను.. అక్కడక్కడా ఇంకాస్త వినోదాన్ని జోడించి ఓ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరపై వడ్డించే ప్రయత్నం చేశారు దర్శకుడు వెంకట్ ప్రభు. నిజానికి ఇలాంటి సీరియస్ కథల్లో లవ్ స్టోరీస్‌కు అంత స్కోప్ కనిపించదు. అందుకే భిన్న ధ్రువాలైన ఈ రెండు అంశాల్ని ఒకే ఒరలో బలవంతంగా ఇరికించే ప్రయత్నాన్ని చేస్తే మొత్తం వంటకమే చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ, దర్శకుడు కొత్తగా ఈ రెండు అంశాల్ని ఆద్యంతం సమాంతరం నడిపించే ప్రయత్నం చేశాడు. ఇదే ఈ చిత్రపై కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
ప్రమోషన్లలో మూవీ టీమ్ చెప్పినట్లుగానే సినిమా తొలి 20నిమిషాలు చాలా సాధారణంగానే సాగుతుంది. కానీ ఓ బాంబు పేలుడు సన్నివేశంతో సినిమా మొదలు పెట్టిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అంబులెన్సుకు దారిచ్చే క్రమంలో సీఎం కాన్వాయ్‌ను శివ అడ్డుకోవడం.. దాంతో అతను వార్తల్లోకెక్కడం.. పోలీస్ స్టేషన్‌లో పై అధికారి తనని అవమానించడం.. ఇలా కథ నెమ్మదిగానే ముందుకు సాగుతుంది. మరోవైపు శివ - రేవతి లవ్ ట్రాక్ మొదలయ్యాకనే కథ వేగం పూర్తిగా మందగిస్తుంది. ఎప్పుడైతే రాజు పాత్ర తెరపైకి వస్తుందో అక్కడి నుంచి కథ పూర్తిగా యాక్షన్ కోణంలోకి టర్న్ తీసుకుంటుంది. అతన్ని శివ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేయడం.. అదే సమయంలో రాజును స్టేషన్‌లోనే హత్య చేసేందుకు పోలీస్ కమీషనర్ నటరాజన్ తన బలగంతో రంగంలోకి దిగడం.. శివ వాళ్లతో తలపడి రాజును స్టేషన్ నుంచి తప్పించడం.. ఇలా కథ రేసీగా ముందుకు సాగుతుంది.
అయితే అంత వేగంగా పరుగులు తీస్తున్న కథకు ప్రతిసారీ లవ్‌ట్రాక్‌తో పాటు అనవసరమైన పాటలు.. ఫ్లోలో వెళ్తున్న మూవీకి స్పీడ్ బ్రేకర్లలా అడ్డుతగులుతుంటాయి. ఇక ఓ అదిరిపోయే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన తీరు మెప్పిస్తుంది. ప్రథమార్ధం వరకు ఫర్వాలేదనట్లుగా సాగి.. ద్వితీయార్ధంలో పూర్తిగా గాడి తప్పింది. రాజును కాపాడుకుంటూ శివ పోలీసులతో చేసే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. మధ్యలో వచ్చే శివ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి సినిమా ఓ సాధారణ రివెంజ్ స్టోరీలా మారిపోతుంది. మధ్యలో 'సింధూర పువ్వు' ఫేమ్ హీరో రాంకీ చేసే ఓ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు ఊహలకు తగ్గట్లుగానే ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే సుదీర్ఘమైన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అక్కడక్కడా మెప్పిస్తుంది. ఓ చిన్న కోర్టు రూం డ్రామాతో సినిమా పేలవంగా ముగుస్తుంది.
ఎవరెలా చేశారంటే: ఓ కామన్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య చాలా బాగా నటించాడు. యాక్షన్ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక కృతిశెట్టి పాత్ర.. స్టోరీ మొత్తం కనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా ఆమె కొత్తగా ఏం చేయనప్పటికీ.. సినిమాలో అక్కడక్కడా ఆమెను యాక్షన్ కోణంలో చూపించే ప్రయత్నాలు చేశారు దర్శకుడు వెంకట్. మరోవైపు అరవింద్ స్వామి, శరత్ కుమార్ పాత్రలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాళ్లిద్దరూ కథలో కనిపించినప్పుడల్లా సినిమా.. కొత్త ఊపును అందుకుంటోంది. ఇక గెస్ట్ రోల్లో వచ్చిన రాంకీ పాత్ర కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ.. అది కూడా ప్రేక్షకులకు మంచి జోష్‌ను ఇస్తుంది. చైతూ అన్నగా నటించిన జీవా కూడా సినిమాలో కాసేపు తళుక్కున మెరుస్తారు. కానీ, ఆ పాత్ర సర్వ సాధారణంగానే ఉంటుంది. జయప్రకాష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రియమణి, తదితరుల పాత్రలన్నీ పరిధి మేరకే కనిపిస్తాయి.
ఇక వెంకట్ ప్రభు కథలు ఎంత విభిన్నంగా ఉంటాయో.. స్క్రీన్‌ప్లే కూడా అంతే కొత్తగా, రేసీగా ఉంటుంది. కానీ, ఈ మూవీ విషయంలో అనవసరంగా ప్రేమకథను ఇరికించి ఓ భిన్నమైన కథను దెబ్బ తీశారు. అసలు ఈ కథలో లవ్ ట్రాక్ లేకున్నా సినిమాకు వచ్చే నష్టమేమీ లేదు. శివ-రేవతి ప్రేమకథలోనూ.. శివ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోనూ అంత ఫీల్ ఏమీ కనిపించదు. యాక్షన్ ఎపిసోడ్‌లను డిజైన్ చేసిన విధానం బాగుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. చాలా పాటల్లో తమిళ వాసన కనిపిస్తుంది. నేపథ్య సంగీతం మాత్రం కొంచం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- బలాలు
- + కథా నేపథ్యం
- + చైతన్య, అరవింద్ స్వామి, శరత్ కుమార్ నటన
- + యాక్షన్ ఎపిసోడ్స్
- బలహీనతలు
- - నిదానంగా సాగే కథనం
- - నాయకానాయికల లవ్ ట్రాక్
- చివరిగా: అక్కడక్కడా మెప్పించే ‘కస్టడీ’
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- ఇదీ చదవండి:
- పరిణీతి చోప్రా ఇల్లు గ్రాండ్‌గా డెకరేట్.. ఇదంతా ఎంగేజ్మెంట్ కోసమేనా!..
- 'సామ్ హార్డ్ వర్కర్.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది'