Tiger Nageswara Rao Review : చిత్రం: టైగర్ నాగేశ్వరరావు, నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషుసేన్ గుప్త, మురళీ శర్మ, అనుకృతి వాస్, గాయత్రీ భరద్వాజ్, నాజర్ తదితరులు; సినిమాటోగ్రఫీ: ఆర్.మది; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్; నిర్మాత: అభిషేక్ అగర్వాల్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; రచన, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా; దర్శకత్వం: వంశీ; విడుదల తేదీ: 20-10-2023
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ. ఈ క్రమంలో ఆయన తాజాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' అనే చిత్రంలో నటించారు. స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే : 1970, 80 దశకాల్లో స్టూవర్టుపురం నాగేశ్వరరావు పేరు వింటే చాలు... అటు ప్రజలతో పాటు ఇటు పోలీసు వ్యవస్థలోనూ ఓ రకమైన అలజడి మొదలయ్యేది. దోపిడీలకి పెట్టింది పేరైన ఆయన కన్నుపడిందంటే చాలు... ఎంత విలువైనదైనా, ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా సరే చెప్పి మరీ దొంగతనం చేస్తారని పేరు. తను దొంగతనాలు చేసే ప్రాంతాన్ని టైగర్ జోన్ అనీ... అతన్ని టైగర్ నాగేశ్వరరావు అనీ పిలుస్తుంటారు. ఇప్పటికీ ఆయన గురించి ఆ ఊరిలో కథలు కథలుగా చెప్పుకొంటుంటారు. అంత పేరు మోసిన దొంగ కథతో రూపొందిన చిత్రమే.. 'టైగర్ నాగేశ్వరరావు'. ఇక ఈ టైటిల్ పాత్రలో రవితేజ నటించారు.
ఇక 1980 నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గురించి దిల్లీలో చర్చ మొదలవుతుంది. ప్రధానమంత్రి భద్రతని సమీక్షించే ఇంటిలిజెన్స్ అధికారి రాజ్‌పుత్ (అనుపమ్ ఖేర్) స్వయంగా రంగంలోకి దిగి స్టూవర్టుపురం గురించి తెలిసిన పోలీస్ అధికారి విశ్వనాథ్ శాస్త్రి (మురళీశర్మ)ని పిలిపించి నాగేశ్వరరావు గురించి ఆరా తీయడం మొదలుపెడతారు. దీనికి గల కారణమేంటి?అసలు ఈ దోపిడీలకి పాల్పడుతున్న నాగేశ్వరరావు లక్ష్యం ఏమిటనేది అసలు కథ.
ఎలా ఉందంటే: జీవిత కథలతో రూపొందిన సినిమాల్లో వాస్తవ సంఘటనల మోతాదు ఎక్కువగానే ఉంటాయి. అక్కడక్కడా మాత్రమే స్వేచ్ఛ తీసుకుని సన్నివేశాల్ని మలుస్తుంటారు. ఇక ఈ సినిమా బయోపిక్‌గానే ప్రచారమైనప్పటికీ.. ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయాల్ని ఆధారంగా చేసుకునే ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. అయితే థియేటర్లోకి వెళ్లి కూర్చున్నాక తెరపై కనిపిస్తున్నది వాస్తవమా లేక కల్పితమా అనే విషయం కంటే ఆ కథ ఆసక్తిని రేకెత్తించిందా? లేదా? అనేదే ప్రేక్షకుడికి కీలకం. ఈ సినిమా ఒక దశ వరకు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తర్వాత గాడి తప్పింది. రక్తం, కన్నీరు కలిసిన సిరాతో రాసిన చరిత్ర అని చెప్పినా కూడా ఇందులో రక్తపాతమే తప్ప కన్నీళ్లు పెట్టించే భావోద్వేగాలు ఎక్కడా పండలేదు. కథలు కథలుగా వినిపించే నాగేశ్వరరావు దొంగతనాలనైనా థ్రిల్ కలిగించేలా తెరపైకి తీసుకొచ్చారా అంటే అదీ కూడా లేదు. ఓ దొంగ ప్రధానమంత్రి సీటు వరకూ వెళ్లాడంటే.. అతడిలో ఎంత ధైర్యం, ఎన్ని తెలివితేటలు ఉండాలి. కానీ, అలాంటి సాహసాల్ని, తెలివి తేటల్ని నాగేశ్వరరావు దోపిడీలలో ఎక్కడా చూపించలేదు.
ప్రారంభంలో రైలు దోపిడీ చూపించారు కానీ.. అది నేచురల్‌గా అనిపించదు. కానీ, గ్రాఫిక్స్, విజువల్స్ బాగున్నాయి. స్టూవర్టుపురం నేర సామ్రాజ్యంతో మొదలయ్యే ఈ కథలో.. ప్రారంభంలో కొన్ని సీన్స్మెప్పిస్తాయి. దొంగతనాల కోసం సన్నద్ధమయ్యే తీరు, స్వార్థపరుల వల్ల దోపిడి చేయాల్సిన పరిస్థితులు రావడం వంటి సన్నివేశాలు ఆడియోన్స్‌ను కథలో ఆకట్టుకుంటాయి. కానీ, ఆ వెంటనే సినిమా పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్‌లోకి వెళ్లిపోతుంది. పోలీసులతో ఫైట్, హీరోయిన్‌తో ప్రేమాయణం ఇలా కథ మరోదారి పడుతుంది. ద్వితీయార్ధంలో అయితే వైలెన్స్ సీన్స్ సాగుతూనే ఉంటాయి. అంతేకానీ కథ ఎక్కడా ఆసక్తి రేకెత్తించదు. స్టూవర్టుపురం జీవితాల్లో మార్పు కోసం పనిచేసిన హేమలతా లవణం పాత్రను ప్రభావవంతంగా చూపించలేదు. 80 దశకంలో సాగే ఈ సినిమాలో రవితేజ, ఇతర పాత్రధారులు కొన్ని సార్లు ట్రెండీగా.. మరికొన్నిసార్లు చారిత్రాత్మక సినిమాల్లోలాగా కనిపిస్తారు. కథ, కథనాల్ని నడిపించిన విధానంలో ఎక్కడా పరిణతి కనిపించదు.
ఎవరెలా చేశారంటే: రవితేజ నటన ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. కమర్షియల్ సినిమాల్లో కనిపించినట్టుగా కాకుండా.. గత సినిమాలకు పూర్తి భిన్నంగా నాగేశ్వరరావు పాత్రలో ఒదిగిపోయారు. లుక్ విషయంలోనూ.. పోరాట ఘట్టాల పరంగానూ ఆయన బలమైన ప్రభావం చూపిస్తారు. హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తమ పాత్రలకి న్యాయం చేశారు. గాయత్రి పాత్ర కాస్త ఎక్కువసేపు తెరపై కనిపిస్తుంది. అనుకృతి పోషించిన పాత్ర చిన్నదే. అనుపమ్ ఖేర్, మురళీశర్మ, నాజర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. రేణుదేశాయ్ చేసిన హేమలతా లవణం పాత్ర తెరపై నిస్తేజంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే యలమంద పాత్రలో హరీష్ పేరడి, ఆయన కొడుకు కాశీగా సుదేవ్ నాయర్, సీఐ పాత్రలో జిషూ సేన్ గుప్తా విలనిజం ప్రదర్శించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం చిత్రానికి ప్రధానబలం. నేపథ్య సంగీతంతో తనదైన ప్రభావం చూపించారు. కెమెరా, ప్రొడక్షన్ డిజైన్ విభాగాలు మంచి పనితీరుని ప్రదర్శించాయి. ఈ సినిమాకి కథ, కథనాలతోపాటు రన్‌టైమ్ మరో ప్రధాన సమస్య. మాటలు బాగున్నాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
+ ఆరంభ సన్నివేశాలు
+ రవితేజ నటన
+ సంగీతం... ఛాయాగ్రహణం
- బలహీనతలు
- ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలు
- కొరవడిన భావోద్వేగాలు
- నిడివి
- చివరిగా: టైగర్ నాగేశ్వరరావు... అక్కడక్కడా మెప్పిస్తాడు!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">