The Kerala Story Director New Movie : వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'తో ఇటు చిత్ర పరిశ్రమ, అటు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు.. సుదీప్తో సేన్. తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'బస్తర్' పేరుతో సినిమాను రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'ది కేరళ స్టోరీ'ని నిర్మించిన విపుల్ అమృత్‌లాల్ షానే ఈ సినిమాకీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2010 ఏప్రిల్‌లో.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సుదీప్తో సేన్ వెల్లడించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
చిత్రపరిశ్రమ తమని శిక్షించాలని చూస్తుంది..
వివాదాస్పద చిత్రంగా విడుదలైన 'ది కేరళ స్టోరీ'ని కొనుగోలు చేసేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు రాకపోవడంపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించారు. చిత్రపరిశ్రమ తమను శిక్షించాలని చూస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ చిత్రానికి దక్కిన విజయాన్ని చూసి కొంతమంది కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని.. అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
"కేరళ స్టోరీకి సంబంధించి మాకింకా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి సరైన ఆఫర్ రాలేదు. ఏదైనా ప్రధాన సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాం. మాపై కక్ష సాధించేందుకు చిత్రపరిశ్రమ ఒక గ్యాంగ్‌గా ఏర్పడినట్లు అర్ధమవుతుంది. మా సినిమా సాధించిన విజయం పరిశ్రమలోని కొందరిని కలవరపాటుకు గురి చేసింది. దీంతో వాళ్లు మమ్మల్ని ఈ విధంగా శిక్షించాలని చూస్తున్నారు."
- సుదీప్తో సేన్, దర్శకుడు
బ్యాన్ విధించినా.. కాసుల వర్షం కురిసింది..
The Kerala Story : అదాశర్మ, సిద్ధి ఇద్నాని, సోనియా, యోగిత ప్రధాన పాత్రల్లో సుదీప్తో సేన్ తెరకెక్కించిన 'ది కేరళ స్టోరీ' దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. కేరళకు చెందిన అమ్మాయిలు అదృశ్యమవ్వడం, వారు మతం మారి ఉగ్రవాద శిక్షణ పొందడం తదితర అంశాలు అందులో ప్రస్తావించడంతో ఈ సినిమా తీవ్ర చర్చకు దారితీసింది. కేరళలో అలా ఘటనే జరగలేదని కొందరు ఈ సినిమాను కొందరు వ్యతిరేకించారు. అయితే 'ది కేరళ స్టోరీ' చిత్ర బృందం చూపించిన.. అదృశ్యమైన అమ్మాయిల సంఖ్య సరైంది కాదని మరికొందరు ఆరోపించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాపై నిషేధం విధించాయి. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా మే 5న విడుదలై, బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.