TFCC Elections 2023 : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో 48 ఓట్లలో దిల్‌రాజుకు 31 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన మ్యాజిక్ ఫిగర్ 25 కంటే 6 ఓట్లు ఎక్కువ సాధించారు. ఆయన ప్రత్యర్థి సి. కల్యాణ్‌కు 17 ఓట్లు పోలయ్యాయి. కాగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. 2262 మంది సభ్యులకు గాను.. మొత్తం 1,339 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏ సెక్టార్లో ఎవరెవరు గెలిచారంటే..
- టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు.
- టీఎఫ్‌సీసీ కార్యదర్శిగా దామోదర ప్రసాద్.
- టీఎఫ్‌సీసీ కోశాధికారిగా ప్రసన్న కుమార్.
- ప్రొడ్యూసర్ సెక్టర్ అధ్యక్షుడిగా శివలంక కృష్ణ ప్రసాద్.
- డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ అధ్యక్షుడిగా మిక్కిలినేని సుధాకర్.
- డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో రెండు ప్యానెల్‌ల నుంచి ఆరుగురి చొప్పున విజయం సాధించారు.
- స్టూడియో సెక్టార్‌లో నలుగురిలో.. ముగ్గురు దిల్‌రాజ్ ప్యానెల్ నుంచి, ఒకరు కల్యాణ్ ప్యానెల్ నుంచి గెలిచారు.
- ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ఇరు ప్యానెల్లో ఎనిమిది మంది చొప్పున గెలుపొందారు.
- ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందికిగాను.. దిల్‌రాజు ప్యానెల్ నుంచి ఏడుగురు విజయం సాధించారు. దిల్‌రాజు, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, దామోదర ప్రసాద్, మోహన్‌గౌడ్, పద్మిని, రవిశంకర్ లు గెలిచారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్ చాంబర్‌కు జరిగే ఎన్నికల్లో నిర్మాతలు దిల్‌రాజు, సి. కల్యాణ్ బరిలో నిలిచారు. కాగా 2023 - 25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ పలు కీలక పోస్టులను కైవసం చేసుకుంది.
అయితే ఈ ఎన్నికల్లో.. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ ముందుకెళ్లగా.. చిన్న సినిమా నిర్మాతల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్ పోటీలో నిలిచాయి.
ఎగ్జిబిటర్ల సెక్టార్ ఎన్నిక ఏకగ్రీవం కాగా.. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 1567 ఓట్లకుగాను 891 ఓట్లు నమోదు అయ్యాయి. ఇంకా స్డూడియో సెక్టార్ నుంచి 98 ఓట్లకు 68 ఓట్లు పోలయ్యాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 597 మందికి గాను 380 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.