కొవిడ్ చీకట్ల నుంచి పూర్తిగా బయటకొచ్చేసింది చిత్ర పరిశ్రమ. థియేటర్లలో కొత్త పోస్టర్ల కళకళలు.. సెట్లో క్లాప్‌బోర్డ్‌ల చప్పుళ్లు.. తారల ప్రచార కాంతులు.. ఎటు చూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. కథానాయకులు కూడా సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకటి తర్వాత ఒకటి అంటూ లెక్కలేసుకుంటూ ముందడుగేసిన హీరోలు.. ఇప్పుడు ఏక కాలంలో రెండు మూడు చిత్రాలతో సెట్స్‌పై బిజీగా గడిపేస్తున్నారు. ఓవైపు చేతిలో ఉన్న చిత్రాలు చకచకా పూర్తి చేస్తూనే.. కొత్త సినిమాలు ప్రకటిస్తూ సినీ ప్రియుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పుడిలా కొత్త కబుర్లు వినిపించేందుకు పలువురు స్టార్లు సిద్ధమయ్యారు..
రవితేజ కోసం మరో కథ..
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపించే కథానాయకుడు రవితేజ. ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు అరడజను చిత్రాలున్నాయి. వాటిలో 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'ధమాకా', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు చిరంజీవి - బాబీ కలయికలో రూపొందుతోన్న 'వాల్తేర్ వీరయ్య' చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో పోషించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఇప్పుడాయన మరో సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 'ప్రేమ ఇష్క్ కాదల్', 'కార్తికేయ', 'అ!' వంటి విజయవంతమైన చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన కార్తీక్.. నిఖిల్ నటించిన 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి కెప్టెన్‌గా మెగాఫోన్ అందుకునేందుకు సిద్ధమయ్యారు. రవితేజ కోసం ఓ విభిన్నమైన కథ సిద్ధం చేశారని, అది ఆయనకి నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
నాగచైతన్య ఖాతాలో..
వెండితెర వేదికగా 'థ్యాంక్ యూ'తో.. ఓటీటీలో 'దూత'గా వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నారు కథానాయకుడు నాగచైతన్య. విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ఈ రెండు ప్రాజెక్ట్‌లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇవి కాక చైతన్య చేతిలో మరో రెండు చిత్రాలున్నాయి. ఒకటి వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న సినిమా కాగా.. మరొకటి పరశురామ్ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్ట్. త్వరలో ఇవి షూటింగ్ మొదలు కాబోతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో చిత్రం చేరినట్లు ప్రచారం వినిపిస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో విజయాన్ని అందుకొన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారని టాక్. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో చైతూ ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
తమిళ దర్శకుడితో గోపీచంద్..
మాస్ యాక్షన్ కథలకు చిరునామాగా నిలిచే కథానాయకుడు గోపీచంద్. ఆయన ఇటీవల మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా చేశారు. ఈ చిత్రం.. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆయన హీరోగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న 'లక్ష్యం2' సైతం చకచకా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఇదవగానే గోపీచంద్ తమిళ దర్శకుడు హరితో ఓ సినిమా పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. 'సింగం' సిరీస్ చిత్రాలతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడాయన. ప్రస్తుతం ఆయన గోపీచంద్ కోసం మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథ సిద్ధం చేశారు. ఇటీవలే చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో గోపీచంద్ ఓకే చెప్పారని తెలిసింది. దీన్ని జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్‌కు గుజరాత్.. రాజస్థాన్‌పై గెలుపు