కరోనా విరామంలో కథానాయకులు బోలెడన్ని కథలు విన్నారు. మూడు నాలుగు కథల్ని పక్కా చేసి వాటితో ప్రయాణం చేస్తున్నవాళ్లు కొంతమందైతే, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఒప్పుకున్న కథలపై కూడా పునరాలోచనలో పడిపోయినవాళ్లు కొంతమంది. మారిన అభిరుచుల కోణంలో ఇప్పుడు సినిమా కేవలం బాగుంటే సరిపోదు, అసాధారణంగా అనిపించాల్సిందే. అలాంటి చిత్రాలకే ప్రేక్షకుడు పట్టం కడుతున్నాడు. అందుకే కథానాయకులు కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఒప్పుకుని ఆయా కథలతో ప్రయాణం చేస్తున్న తారలు కూడా దర్శకులకి మార్పు చేర్పులు సూచిస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటూ ఆయా కథలు స్క్రిప్ట్ దశల్లో ఉన్నాయి.
కెరీర్‌లు పోటాపోటీగా సాగుతున్న కాలం ఇది. ఈ సమయంలో కూడా చాలా మంది కథానాయకులు కథల కోసం ఎదురు చూస్తూ ఖాళీగా గడుపుతున్నారంటే ఆ అంశానికున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం అవుతోంది. ప్రేక్షకుడు ఇప్పుడు కాంబినేషన్ల కంటే కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. కథ నచ్చలేదంటే అందులో ఎంతమంది తారలున్నా, ఎంత మంచి కలయికలైనా నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించే కథానాయకులు కథల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఆ క్రమంలో ఎంత విరామం వచ్చినా సరే, వేచి చూస్తున్నారు.
సీనియర్ కథానాయకుడు నాగార్జున 'ది ఘోస్ట్' తర్వాత మరో కథని పక్కా చేయలేదు. ఈ ట్రెండ్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ సమయాన్ని గడిపానని, ఇంకొన్నాళ్లు కథల కోసమే కేటాయించి ఆ తర్వాత ఓ నిర్ణయానికొస్తానని ఇటీవలే చెప్పారాయన. మోహన్‌రాజాతోపాటు, పలువురు దర్శకులు ఆయనకి కథలు వినిపించినట్టు తెలుస్తోంది. వెంకటేష్ కూడా తెలుగు కథలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 'ఓరి దేవుడా'లో ఓ చిన్న పాత్ర చేశారు, సల్మాన్‌ఖాన్‌తో కలిసి హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు కథలపై మాత్రం ఆయన ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. యువ దర్శకులు తరుణ్ భాస్కర్, అనుదీప్ కె.వి. పేర్లు వినిపించాయి కానీ వెంకీ ఎవరి కథకి పచ్చజెండా ఊపుతారనేది చూడాలి.
రామ్‌చరణ్ 'ఆర్.ఆర్.ఆర్', 'ఆచార్య' చేస్తున్నప్పుడే శంకర్‌తో సినిమాకి పచ్చజెండా ఊపారు. ఇక ఆ తర్వాత ఏమిటనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆయనకి పలువురు యువ దర్శకులు కథలు వినిపించారు. పొరుగు భాషల నుంచి కూడా కథలు విన్నారు. అయినా ఇంకా ఆయన అన్వేషణ కొనసాగుతూనే ఉంది. 'విరాటపర్వం', 'భీమ్లానాయక్' తర్వాత యువ కథానాయకుడు రానా దగ్గుబాటి కొత్త ప్రాజెక్ట్‌లేవీ ఇంకా కొలిక్కి రాలేదు.
యువతరంలో నాని, విజయ్ దేవరకొండ కొత్త కథల విషయంలో జోరు చూపించేవారు. ఒక సినిమా పట్టాలపై ఉండగానే, కొత్తగా రెండు సినిమాల్ని ఖాయం చేసి ప్రకటించేవారు. 'దసరా' తర్వాత నాని చేయనున్న సినిమా ఏమిటనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఆయన కూడా కథల పరంగా మథనం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. 'లైగర్' పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ కూడా కథలపై పునరాలోచనలో పడ్డారు. అప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పట్టాలెక్కిన 'జనగణమన' సినిమాని కూడా పక్కనపెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖుషి' తర్వాత విజయ్ దేవరకొండ ఎవరితో కలిసి జట్టు కడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కథల విషయంలో తొందరపడకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయడంపైనే కథానాయకులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.