నయనతార, విఘ్నేశ్ శివన్‌ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాము ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు వీరిద్దరు ఆదివారం ప్రకటించారు. అయితే వీరిద్దరికి పెళ్లి అయి దాదాపు నాలుగు నెలలే అయ్యింది. సరోగసీ విధానంతో వీరిద్దరూ పిల్లలకు తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. అయితే, సరోగసీ విషయంలో నయన్, విఘ్నేశ్.. నియమాలు సరిగా ఫాలో అయ్యారా? లేదా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు.
'సరోగసీ విధానం మీద ఇదివరేకే చర్చ నడుస్తోంది. సరోగసీ నిబంధనల ప్రకారం 21 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళలు వాళ్ల అండాలను వారి భర్తల లేదా తండ్రుల నుంచి అనుమతి పొంది దానం చేయెచ్చు. అయితే నయనతార, విఘ్నేశ్ శివన్ నిబంధనలు ఫాలో అయ్యారా లేదా అని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అడుగుతా'మని చెప్పారు. అలాగే ప్రభుత్వం వారి నుంచి వివరణ కోరుతుంది అని తెలిపారు.
జూన్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించకున్నట్లు సమాచారం. ఆదివారం.. విఘ్నేశ్ శివన్ పిల్లల పాదాలను ముద్దాడుతన్న ఫొటోలను షేర్ చేసి.. తాము తల్లిదండ్రులమైనట్టు రాసుకొచ్చారు. వీరికి చాలా మంది అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే కొంత మంది.. పెళ్లైన దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కావచ్చా అనే ప్రశ్నలు లెవనెత్తారు.
సరోగసీ విధానంలో పిల్లలు కావాలనుకున్న భార్యాభర్తలు.. వారికి పెళ్లై ఐదేళ్లు పూర్తి అయిందని.. అయినా తమకు పిల్లలు పుట్టడం లేదని నిరూపించుకోవాలి. అనంతరం సరోగసీ విధానంలో పిల్లలు కనేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఏ మహిళైతే పిల్లల్ని కంటుందో.. ఆమెకు సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకునే వారితో జన్యుపరమైన సంబంధముండాలి. స్వచ్ఛందంగానే పిల్లల్ని కనేందుకు మహిళ ముందుకురావాలి. ఇలాంటి విధానాలను పర్యవేక్షించేందుకు.. జాతీయ సరోగసీ బోర్డు, రాష్ట్ర సరోగసీ బోర్డు అనే సంస్థలు ఉంటాయి. అయితే నియమాలన్నీ నయన్, విఘ్నేశ్ దంపతులు పాటించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.