Actor Abbas Injury : 'ప్రేమదేశం' సినిమాతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు అబ్బాస్. కొన్నాళ్ల నుంచి నటనకు దూరమైన ఆయన ఓ హాస్పిటల్ బెడ్‌పై కనిపించడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోకి ఏం జరిగిందంటూ ఆరా తీస్తున్నారు.
ఏమైందంటే.. అబ్బాస్ ఈ ఆగస్టులో (న్యూజిలాండ్‌లో) బైక్ పై నుంచి కిందపడడంతో ఆయన కుడి కాలికి గాయమైంది. కొన్నాళ్లు మెడిసిన్ వాడుతూ విశ్రాంతి తీసుకోగా.. ఈ నెల 18న వైద్యులు ఆయన కాలికి శస్త్ర చికిత్స చేశారు. అదే రోజు అబ్బాస్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ బెడ్‌పై ఉన్న ఫొటోని పంచుకున్నారు.
ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. "హాస్పిటల్‌లో ఉన్నంతసేపు ఇబ్బందిగా ఫీలయ్యా. నా భయాన్ని అధిగమించి, ధైర్యం తెచ్చుకొన్నా. నేను ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు" అని సర్జరీ పూర్తయిన తర్వాత అబ్బాస్ తెలిపారు.
తొలి సినిమా 'ప్రేమదేశం' సూపర్‌హిట్‌కావడంతో అబ్బాస్‌కు తమిళం, తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ పరిశ్రమల్లో వరుస అవకాశాలొచ్చాయి. హీరోగానేకాకుండా కీలక పాత్రల్లోనూ నటించి మెప్పించారాయన. 'రాజహంస', 'రాజా', 'నీ ప్రేమకై', 'అనగనగా ఒక అమ్మాయి', 'కృష్ణబాబు', 'శ్వేతనాగు', 'నరసింహ', 'అనసూయ' తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన అబ్బాస్ రీ ఎంట్రీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. 2015లో ఇండస్ట్రీకి దూరమైన అబ్బాస్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు.