నటశేఖరుడు, సూపర్‌స్టార్ కృష్ణ తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం తెల్లవారుఝామున కృష్ణ కన్నుమూయగా.. బుధవారం సాయంత్రం వందల మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఫిలింనగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా, కృష్ణ అంతిమయాత్ర పటిష్ఠ బందోబస్తుతో పద్మాలయ స్టూడియో నుంచి ఫిలింనగర్ మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
ప్రముఖుల సంతాపం.. కృష్ణ మృతికి ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ సహా పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరన్న సంగతి తెలియగానే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మంచు మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కేటీఆర్ ఇంకా పలువురు ఉన్నారు.
మంగళవారం వేకువజామున.. ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు.
సూపర్‌స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తర్వాత కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: మహాకవి శ్రీశ్రీ.. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఏమన్నారంటే..!
కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు తారక్ బన్నీ రామ్‌చరణ్ ఇంకా ఎవరెవరు వచ్చారంటే