Sudheer Babu Latest Interview : టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు తాజాగా 'మామా మశ్చీంద్ర' సినిమాలో మెరిశారు. అందులో ఆయన త్రిపాత్రాభినయంలో కనిపించారు. ప్రముఖ నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. వైవిధ్యమైన ట్రైలర్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ హీరో సుధీర్‌బాబు.. హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. మీకు ఎలా అనిపించింది.
మానసికంగా, శారీరకంగా నాకు చాలా సవాళ్లే ఎదురయ్యాయి. నన్ను ఎక్కువగా.. ఆకర్షించిన విషయం కూడా ఈ త్రిపాత్రాభినయమే. 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' నుంచి నా కెరీర్‌లో క్లిష్టమైన పాత్రలను కొన్నింటిని నేను చేశాను. అవా నేను కొత్తగా ప్రయత్నిస్తాననే ఓ బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమా కూడా రూపొందింది. కమర్షియల్‌గా సాగే ఈ సినిమాలో బలమైన కథ కూడా ఉంది.
ఏ పాత్ర ఎక్కువ సవాళ్లుగా అనిపించింది ?
ఒక సినిమాలో మూడు పాత్రలు చేస్తున్నప్పుడు ఏదీ ఒకదాని ఒకటి దగ్గరగా ఉండకూడదు. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదట కథ విన్నప్పుడు పరశురామ్, దుర్గ పాత్రల కోసం కష్టపడితే... సిక్స్ ప్యాక్‌తో కనిపించే మూడో పాత్రని అవలీలగా చేస్తాను అని అనుకున్నాను. తీరా ఆ రెండు పాత్రలు చేసిన తర్వాత మూడో పాత్రే ఎక్కువగా కష్టం అనిపించింది. 120 కేజీల బరువుతో కనిపించే పాత్ర కోసం నిజంగానే అంత బరువు పెరగాలని అనుకున్నాను. ఇదే విషయం మహేశ్‌తో చెప్పినప్పుడు.. ఉన్నట్టుండి అంత బరువు పెరగడం మంచిది కాదని చెప్పారు. ఇంకా చాలా మంది సన్నిహితులు వద్దని వారించారు. దీంతో ప్రొస్థెటిక్ మేకప్‌తో ఆ పాత్రని చేశాను. పాత్రలకి తగ్గట్టుగానే రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర యాసల్లో డైలాగ్స్ చెప్పాను. వాస్తవానికి నాకు ఈ మూడు యాసలూ కొత్తే. నాకు అలవాటైన యాసలోనూ ఓ పాత్రకి డబ్బింగ్ చెప్పాను. ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమా సవాళ్లు విసిరించింది.
సూపర్‌స్టార్ కృష్ణ కోసం ఈ సినిమాలో ఓ పాత్ర రాశారట కదా. ఆయనకి ఈ కథ చెప్పారా?
స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అనుకున్నాం. అయితే అప్పటికే కృష్ణగారు సినిమాలు చేయడం ఆపేశారు. కానీ ఆయన్ని ఎలాగైనా ఒప్పించగలనని, కుదిరితే ఆ సన్నివేశాల్ని ఇంట్లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేశాం. కానీ అది చేయలేకపోయాం. ఆయన లేకుంటే ఆ సీన్స్‌కు అంత ప్రాధాన్యం ఉండదు. అందుకే ఆ సన్నివేశాలు తీయలేదు. ప్రతి సినిమా విడుదల రోజు మామగారితో మాట్లాడేవరకూ ఎవరి కాల్స్‌ని అటెండ్ చేసే వాడిని కాదు. మా సినిమాలు ఎలా ఉన్నాయో ఆయన చెప్పాకే మిగతావాళ్ల అభిప్రాయాలు తెలుసుకునేవాళ్లం. మా జీవితాల్లో ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు.
సూపర్‌స్టార్ కృష్ణ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే మీరు సిద్ధమేనా?
నాకు ఆ అవకాశం వస్తే కచ్చితంగా అదరగొడతాను. సూపర్‌స్టార్ బయోపిక్ చేస్తే నా కెరీర్‌కి ఉపయోగపడుతుందనో లేదంటే ఆయన మామగారు అని నేను ఆసక్తి చూపడం లేదు. బయోపిక్ చేస్తున్నప్పుడు ఆ కథ తాలూకు ఆత్మని పట్టుకోవడం ముఖ్యం. కృష్ణగారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన జీవితంలో ఎత్తు పల్లాల గురించి, సంఘర్షణ గురించి నాకు తెలుసు. బయోపిక్ అంటే... వాళ్లలా నడిస్తేనో, వాళ్లలా హావభావాలు ప్రదర్శిస్తేనో అయిపోదు. సినిమాకి అది కేవలం అలంకరణ మాత్రమే. అసలు విషయం ఉన్నది ఆత్మలోనే. అందుకే కృష్ణగారి బయోపిక్ అవకాశంపై ఆత్రుతగా ఉన్నాను.
కథల ఎంపిక పరంగా ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
నటుడిగా నేను స్వార్థంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఇదివరకు కొత్తదంటే పరిగెత్తేవాణ్ని. కానీ అది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఆలోచించాలని 'హంట్' తర్వాత అర్థం చేసుకున్నాను. ఓ సినిమా చేస్తే అది కొత్తగా ఉండాలి, అదే సమయంలో అందరినీ సంతృప్తి పరిచేలా ఉండాలని అనుకుంటాను.
పుల్లెల గోపీచంద్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది?
ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది. కానీ అంతకంటే ముందు నావి మూడు విడుదలవుతాయి. ఇదివరకు వేరే నిర్మాణ సంస్థ దగ్గర రైట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ వాటిని సొంతం చేసుకుంది. ప్లేయర్ గోపీచంద్, కోచ్ గోపీచంద్ ఇలా రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. ఆ తర్వాత ఆ నిర్ణయం మారింది. ఇలా స్క్రిప్ట్ దశలో ఉంది ఆ చిత్రం. తదుపరి నా చిత్రం 'మా నాన్న సూపర్‌హీరో' రిలీజ్ కానుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. 'హరోం హర' అనే మరో సినిమా చేస్తున్నాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">