హాలీవుడ్ దర్శక ధీరుడు స్టీవెన్ స్పిల్‌బర్గ్‌ను కలిసేందుకు చాలా మంది ఎదురుచూస్తారు. స్టీవెన్‌ను గాడ్ ఆఫ్ మూవీస్‌గా అభివర్ణిస్తారు. 'జురాసిక్ పార్క్', 'హుక్', 'ది టర్మినల్', 'ది పోస్ట్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ ప్రదానోత్సవంలో స్టీవెన్‌ను కలిసిన రాజమౌళి సైతం అమితానందం వ్యక్తం చేశారు. "నేను దేవుడుని ఇప్పుడే కలిశా" అని ట్వీట్ చేసి ఆయన వీరాభిమానాన్ని చాటుకున్నారు. అయితే అంతటి పేరున్న స్టీవెన్.. తన సినిమాలో ఓ నటుడిని తీసుకోవటం కోసం స్వయంగా భారత్‌కు వచ్చారు. చిత్ర బృందంతో సహా ఇండియాకు వచ్చి ఆడిషన్స్ నిర్వహించారు. ఆ నటుడు మరెవరో కాదు... అనేక ప్రతినాయక చిత్రాలతో అలరించిన అమ్రీశ్ పురీ.
'ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్' చిత్రంలో మోలారామ్ అనే విలన్ పాత్ర కోసం మంచి నటుడిని వెతికేందుకు నానా ప్రయత్నాలు చేసింది స్టీవెన్ టీమ్. భారత్‌కు చెందిన అమ్రీశ్ పురీ గురించి తెలుసుకొని ఆడిషన్స్ కోసం ఇక్కడికి వచ్చింది. స్టీవెన్ సైతం చిత్రబృందంతో పాటు ముంబయికి వచ్చారు. అమ్రీశ్కు ఆడిషన్ నిర్వహించి.. వెంటనే పాత్రకు ఎంపిక చేశారు. ఓ నటుడి కోసం స్వయంగా స్టీవెన్ ఓ దేశానికి వెళ్లి ఆడిషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ విషయాన్ని స్పిల్బర్గ్ స్వయంగా ఓ లేఖలో రాశారు. 'అమ్రీశ్ పురీ ఎప్పటికీ ప్రపంచంలోనే గొప్ప విలన్‌గా నిలిచిపోతారు. ఎవరూ దీన్ని మార్చలేరు. ఓ నటుడిని ఆడిషన్ చేసేందుకు నేను వేరే దేశానికి వెళ్లడం ఆయన విషయంలోనే జరిగింది' అని చెప్పారు స్పిల్బర్గ్. ఈ పాత్ర కోసం తనను సంప్రదించిన విషయంపై అమ్రీశ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: