పడి లేచిన కెరటం రాజశేఖర్. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు అడుగుపెట్టారు. ఎప్పట్లాగే అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పూర్తి చేశారు. రీమేక్ సినిమాలతో తిరుగులేని విజయాల్ని అందుకున్న ఆయన మరోసారి 'శేఖర్'తో ఆ ప్రయత్నం చేశారు. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం విలేకర్లతో ముచ్చటించారు.
ఈ కథని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణమేదైనా ఉందా?
నేను చేసిన రీమేక్ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. 'శేషు' విషయంలోనే ఇమేజ్ పరంగా సమస్యలు రావడంతో అంత పెద్ద విజయం సాధించలేకపోయింది. తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం... నా కెరీర్‌లో పెద్ద విజయాలు సాధించిన సినిమాలన్నీ రీమేక్‌లే. అందుకే ఈసారి మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్'ని తీసుకుని 'శేఖర్' తెరకెక్కించాం.
ముందస్తు విడుదల వేడుకలో మీ మాటల్లో ఒత్తిడి కనిపించింది?
ఈ సినిమా విజయవంతమైతేనే అప్పుల నుంచి బయటపడతాం. ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఓ విభిన్నమైన సినిమాని ఇవ్వాలనే ఈ కథని ఎంపిక చేసుకున్నా. వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచను. నాకు మంచి చేయాలని ప్రేక్షకులు అనుకుంటే 'సినిమా బాగుంది' అన్న మాట వినిపించిన వెంటనే థియేటర్‌కి వెళ్లమని చెబుతున్నా. ఎప్పుడూ లేనంత ఒత్తిడితోనే నా సినిమాని బతికించండి అనే మాటని చెప్పా.
కొవిడ్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం ఎలా అనిపించింది?
ఆ సమయంలో డెత్ బెడ్‌పైకి వెళ్లి మళ్లీ వచ్చాను. 75 కేజీల బరువుండే నేను 62కి తగ్గాను. కూర్చున్నా ఆయాసం వచ్చేది. నాకు బోర్ కొట్టకుండా చికిత్స జరిగేటప్పుడు ఐసీయూలో టీవీ పెట్టారు. అందులో హీరోల డ్యాన్సులు, ఫైట్లు చూసి 'నేను ఇలా ఉండేవాణ్ని కదా, జీవితం ఇలా అయిపోయిందేమిట'ని బాధపడ్డా. ఇంక నేను సినిమాలు చేయడానికి పనికి రాననుకున్నా. జీవితతో 'జోసెఫ్' రీమేక్ హక్కుల్ని ఎవరైనా అడిగితే ఇచ్చేయ్ అని చెప్పా. తను 'లేదండీ, మీరు కోలుకుంటార'ని చెప్పేది. సినిమాపై కసితో మళ్లీ సెట్లోకి అడుగుపెట్టి 'శేఖర్'ని పూర్తి చేశా. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో 'శేఖర్' ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
'శేఖర్'లో కొత్తగా కనిపిస్తున్నారు. నటుడిగా ఇది ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
నటుడిగా చాలా సంతృప్తినిచ్చింది. పాత్ర, అందులో ఉన్న భావోద్వేగాలు అలాంటివి. 55, 60 ఏళ్ల మధ్య వయస్కుడిగా కనిపిస్తా. సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన స్పందన మొదలుకొని, సాయికుమార్ చెప్పిన మాటల వరకు కచ్చితంగా హిట్ కొడుతున్నామనే నమ్మకాన్ని పెంచాయి. అనూప్ రూబెన్స్ సంగీతం చాలా బాగా కుదిరింది. కొన్ని సన్నివేశాల్లో సంభాషణలు ఉండవు. సంగీతమే వాటిని నడిపిస్తుంటుంది.
కొత్త కథలు.. 'దొరసాని' దర్శకుడు మహేంద్ర మా నలుగురి కోసం ఓ కథ చెప్పారు. కొన్ని మార్పుల్ని సూచించాం. ప్రవీణ్ సత్తారు 'గరుడవేగ2'లో మీతోపాటు, ఇద్దరు కూతుళ్లు కనిపించేలా ఓ ఆలోచన ఉందని చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం. తదుపరి నేను చేయనున్న సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో ఓ స్క్రిప్ట్ సిద్ధమైంది. త్వరలోనే ఆ వివరాల్ని చెబుతా.
ఇదీ చదవండి: మిస్ ఇండియా పోటీల్లో శివాని రాజశేఖర్.. ఫైనల్ లిస్ట్‌లో ఎన్నో స్థానంలో ఉన్నారంటే!