Rs 1 Crore Remuneration First Heroine : భారతీయ చిత్రపరిశ్రమలో నటీనటులు రూ.కోట్లు పారితోషికం తీసుకోవడం అనేది ఈ రోజుల్లో మామూలు విషయంగా మారిపోయింది. హిందీ, తెలుగు, తమిళం అనే తేడాలు లేకుండా అన్ని చోట్లా నటులకు రూ.కోట్లు కుమ్మరించేందుకు నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారు. పాపులారిటీ, క్రేజ్ ఉన్న సెలబ్రిటీల కాల్షీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా పెద్ద మొత్తంలో పారితోషికాల రూపంలో ముట్టజెబుతుండటం గమనార్హం.
హీరోల స్థాయిలో కాకపోయినా హీరోయిన్లు కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్‌తో చిన్న సినిమాలు రెండు, మూడు తీసి విడుదల చేసేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టే వారు అందుకునే మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలో ఏదైనా డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రాన్ని బట్టే నడుస్తుంది. పాపులారిటీ, సక్సెస్ ఉన్న వారికే ఇక్కడ అగ్రతాంబూలం.
అయితే ఇప్పుడు స్టార్ కథానాయికలుగా చెలామణి అవుతున్న వారందరూ సినిమాల్లో నటించినందుకు రూ.కోట్లలో తీసుకుంటున్నారు. అలాగే యాడ్స్‌లో కనిపిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు కాదు.. కొన్ని దశాబ్దాల కిందే ఒక భారతీయ నటి రూ.కోటి పారితోషికం తీసుకున్నారంటే నమ్ముతారా? వినకడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆమె మరెవరో కాదు.. దిగ్గజ నటి భానుమతి రామకృష్ణ. ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బహుముఖ ప్రజ్ఞాశాలి
భారతీయ చిత్రపరిశ్రమకు టాలీవుడ్ అందించిన గొప్ప నటీమణుల్లో ఒకరు డాక్టర్ భానుమతి రామకృష్ణ. అసామాన్య ప్రతిభకు ఆమె నిదర్శనం. అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమలో ఆమె పేరు ధైర్యానికి పర్యాయపదంగా ఉండేది. భానుపతి పేరులోనే గాంభీర్యం ఉంది. అది ఆమె ప్రతి కదలిక, పనిలోనూ అది సుస్పష్టంగా కనిపించేది. భానుమతి కేవలం నటి మాత్రమే కాదు.. రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత కూడా కావడం విశేషం. ప్రతి శాఖలోనూ ఆమె తన ప్రజ్ఞను చాటుకున్నారు.
ఆ పాత్రతో మొదలు
Bhanumathi Ramakrishna First Movie : బహుముఖ ప్రజ్ఞాశాలైన భానుమతి తన గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా క్రమశిక్షణతో మెలిగారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తన అద్వితీయ ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 1924 సెప్టెంబర్ 7న ఆమె జన్మించారు. 'వరవిక్రయం' (1939) భానుమతి నటించిన మొదటి సినిమా. ఇందులో 'కాళింది' అనే పాత్రలో ఆమె అలరించారు.
'వరవిక్రయం' తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ.. 'కృష్ణప్రేమ' (1943) ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన పాలువాయి రామకృష్ణతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇంట్లో వారికి చెప్పకుండా ఇరవై ఏళ్ల వయసులోనే రామకృష్ణను పెళ్లి చేసుకున్నారామె. వివాహం తర్వాత ఆమె సినీ కెరీర్ మరింత ఊపందుకుంది.
ఎన్నో సూపర్ హిట్లు
Bhanumathi Ramakrishna Movies : 'చండీరాణి', 'చింతామణి', 'వివాహబంధం', 'అమ్మాయి పెళ్లి' లాంటి వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు భానుమతి. అగ్రహీరోలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుతో కలసి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో కలసి చేసిన 'మల్లీశ్వరి' సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆమె నటించిన ఆఖరి చిత్రం 1998లో వచ్చిన 'పెళ్లికానుక'. 60 ఏళ్ల సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నో సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న భానుమతి.. 2005, డిసెంబర్ 25న కన్నుమూశారు.
అప్పట్లోనే అంత పారితోషికమా?
Bhanumathi Ramakrishna Remuneration : భారతీయ చిత్రపరిశ్రమలో భారీ మొత్తంలో పారితోషికం అందుకున్న నటిగా భానుమతి గురించే చెప్పుకుంటారు. మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.90గా ఉన్నప్పుడు భానుమతి ఒక్కో సినిమాలో నటించేందుకు గానూ రూ.25,000 ఛార్జ్ చేసేవారట. ఇప్పటి లెక్కల్లో చూసుకుంటే దాని విలువ దాదాపు రూ.2 కోట్లు అన్నమాట. మన దగ్గర టాప్ హీరోయిన్లుగా చెప్పుకునే శ్రీదేవి, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ దగ్గర నుంచి ఇప్పటి ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియా భట్ వరకు ఎవరూ ఈ స్థాయిలో పారితోషికం అందుకోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">