ఆర్‌ఆర్‌ఆర్.. రిలీజ్‌పై సంవత్సరం అవుతున్నా ఇంకా ఈ పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తూనే ఉంది. ఇంకా కొన్ని దేశాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందులో జపాన్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రం అక్కడి దేశంలో ఓ రికార్డు సాధించింది. జపాన్‌లో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ ఘనత దక్కించుకుంది. ఈ విషయంపై రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు.
"మునపటి రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు లేదా అంతకు మించి ఆడితే అది చాలా పెద్ద విషయం. ఆ రోజులన్నీ మధుర జ్ఞాపకాలే. కాలక్రమేణా వ్యాపారం తీరు మారింది. కానీ, ఇప్పుడు జపాన్‌లోని సినీ ప్రియులు మాకు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేశారు. మేము తిరిగి ఆ ఆనందాన్ని పొందేలా చేశారు. లవ్ యూ జపాన్, థ్యాంక్యూ" అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్-రామ్‌చరణ్ నటించిన ఈ సినిమా గతేడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును పొందింది. సినిమా విడుదలతోనే బాక్సాపీస్‌ను షేక్ చేసింది. సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాట ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్‌కు కూడా నామినేట్ అవ్వడం ఎంతో విశేషం. నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయింది.