Oscar Nominations 2023: ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ కానున్న సినిమా ఏదన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో 'ఆర్ఆర్ఆర్' షార్ట్ లిస్ట్ కావడం ఖాయమంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయిన ఈ సినిమా మరికొన్ని విభాగాల్లో చోటు దక్కించుకోనున్నట్లు హాలీవుడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.
వాటిన్నంటికి సమాధానం మంగళవారం దొరకనుంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్‌తో పాటు మరికొన్ని జాబితాల నామినేషన్స్ వివరాల్ని మంగళవారం ఉదయం అనౌన్స్ చేయబోతున్నారు. కాలిఫోర్నియాలోని బ్లేవరిహిల్స్ వేదికగా ఈ ఆస్కార్ షార్ట్ లిస్ట్ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో రిజ్ అహ్మద్, అలిసన్ విలియమ్స్ షార్ట్ లిస్ట్ కానున్న సినిమాల లిస్ట్‌లను ప్రకటించబోతున్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లో ఎవరు?
బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో రాజమౌళి పేర్లు షార్ట్ లిస్ట్ అవుతాయా లేదా అన్నది సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్ఆర్ఆర్ సహా ఇండియా నుంచి కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, విక్రాంత్ రోణ, గంగూబాయి, ఇరైవిన్ నిజాల్‌తో పాటు మరికొన్ని సినిమాలను ఆయా నిర్మాణ సంస్థలు ఆస్కార్ అవార్డుల కోసం అప్లై చేశాయి. వివిధ విభాగాల్లో పరిశీలనలో ఉన్న ఈ సినిమాలు షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటాయా లేదా అన్నది చూడాల్సిందే.
భారత్ నుంచి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ క్యాటగిరీలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' మాత్రమే అధికారికంగా ఎంట్రీని దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 12న జరుగనుంది.