బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ . దక్షిణాది దర్శకుల్లా బాలీవుడ్ వాళ్లు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించలేరనే అపోహను ఈ సినిమా పటాపంచలు చేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు'పఠాన్' టీమ్‌ను మెచ్చుకుంటూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు.
"1. ఓటీటీ వృద్ధి చెందుతోన్న ఈరోజుల్లో థియేటర్ కలెక్షన్స్ మళ్లీ మెరుగుపడవు. 2. షారుఖ్ కెరీర్ అయిపోయింది. 3. దక్షిణాది దర్శకులు తెరకెక్కించిన విధంగా బాలీవుడ్ వాళ్లు కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించలేరు. 4. 'కేజీయఫ్-2' తొలిరోజు కలెక్షన్స్‌ను బ్రేక్ చేయడానికి కొన్నేళ్లు సమయం పడుతుంది. అయితే.. పైన పేర్కొన్న అపోహలన్నింటినీ 'పఠాన్' పటాపంచలు చేసింది" అని వర్మ తెలిపారు.
'జీరో' తర్వాత షారుఖ్ నటించిన చిత్రమిది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధార్థ్ ఆనంద్ 'పఠాన్'ను తెరకెక్కించారు. దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలకపాత్రలు పోషించారు. 'రా' నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం తొలిరోజే రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు.