సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్. ఆయన మద్రాసులో నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు! కాలే కడుపుతోనే కళామతల్లిని నమ్ముకున్నారు. అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పుడే ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆయన 'అపూర్వ రాగంగళ్' చిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. శివాజీని కూడా ఆ సినిమాకు తీసుకున్నారు. అప్పటికే సినిమాల్లో శివాజీ పేరుతో నటుడు ఉండటంతో శివాజీరావ్‌కు వేరే పేరు పెట్టాలనుకున్నారు. బాలచందర్ పేరు కోసం ఎక్కువసేపు ఆలోచించలేదు. ఆయన తీసిన సినిమా మేజర్ చంద్రకాంత్‌లో ఓ పాత్ర పేరు రజనీకాంత్. దీంతో ఈ పేరును శివాజీకి పెట్టాలని నిర్ణయించారు. దీంతో శివాజీరావుకు ఇష్టదైవమైన రాఘవేంద్రస్వామిని ఆరాధించే గురువారం రజనీకాంత్‌గా నామకరణం చేశారు. తొలి సినిమానే రజనీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
కమల్‌హాసన్ నటనను చూస్తూ తాను నటుడిగా ఎదిగాను అంటారు రజనీ. అప్పుడు అవరగళ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. రజనీ బయట ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఈ విషయం తెలిసి బాలచందర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే రజనీకాంత్‌ని సెట్ లోపలకి రమ్మన్నారు. 'సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లావా? కమల్ నటిస్తున్నాడు జాగ్రత్తగా గమనించు. అలా గమనిస్తే నీ నటన మెరుగుపడుతుంది' అని మందలించారు. దీంతో అప్పటి నుంచి కమల్ నటనను దగ్గరుండి చూసేవారు రజనీ. అయితే కమల్ ఉన్న పరిశ్రమలో తానూ రాణించాలంటే ఇంకేదో భిన్నంగా చేయాలి.. అదే రజనీ చేశారు. ఈ క్రమంలో మరో అరుదైన ఘనతనూ దక్కించుకున్నారు. తొలి చిత్రం 'అపూర్వ రాగంగళ్'(తమిళం) కాగా, రెండోది కన్నడలో 'సంగమ'. మూడోది తెలుగు చిత్రం 'అంతులేని కథ'. ఇలా తొలి మూడు చిత్రాలు మూడు భాషల్లో నటించారు. రజనీ సూపర్‌స్టార్ అయ్యాడు.
తన మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రజనీ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన 'భైరవి' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడే ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్’ అని వేశారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.
ఇదీచూడండి: అలా ఉండటం ఇష్టం లేదంటున్న సారా