Rajamouli CAA Agency : సినిమాకి హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. బలం ఉందంటే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎంతదూరమైనా వెళుతోంది. అందుకే ఈమధ్య దర్శకనిర్మాతలు ఎప్పటికప్పుడు తాము తీసే సినిమాల స్థాయిని పరిమితం చేయకుండా.. వాటి పరిధిని విస్తృత పరిచే ప్రయత్నం చేస్తున్నారు. కథలు చెప్పడంలోనూ.. సాంకేతిక హంగుల్ని జోడించడంలోనూ అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటించేందుకు మొగ్గు చూపుతున్నారు.
అగ్ర దర్శకుడు రాజమౌళి 'ఈగ' మొదలుకొని ప్రతి సినిమాతోనూ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ సరికొత్త మార్కెట్లని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్'తో ఆయన అంతర్జాతీయ మార్కెట్‌ని మరింతగా ఆకర్షించారు. ఇప్పుడు ఆయన సినిమాల్ని చూసే విధానమే మారింది. అందుకు తగ్గట్టే రాజమౌళి తదుపరి సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి.
మహేష్‌బాబుతో తీయనున్న యాక్షన్ అడ్వంచర్ చిత్రం కోసం ఆయన అమెరికాకి చెందిన ప్రఖ్యాత సీఏఏ (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హాలీవుడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నటులు, సాంకేతికత పరంగా ఈ సంస్థ సహకారం అందిస్తుంది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాలకి ఈ సంస్థ పని చేసింది. ఇప్పుడు రాజమౌళి ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హాలీవుడ్ నటులు కూడా ఇందులో నటించే అవకాశాలుంటాయనే ప్రచారం మొదలైంది.
అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప2'కి కూడా అంతర్జాతీయ హంగుల్ని జోడిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కథను విదేశాలతోనూ ముడిపెడుతున్నట్టు సమాచారం. అందుకోసం విదేశీ నటులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. విదేశీ సాంకేతికత, చిత్రీకరణకు అవసరమైన ప్రత్యేక సామాగ్రిని కూడా దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో బిజీ బిజీగా ఉంది. మహేష్ - రాజమౌళి చిత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.
ఇవీ చదవండి: ఆయన కోసమే పొన్నియన్ సెల్వన్ చేశా: చియాన్ విక్రమ్