పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2023 సెప్టెంబరులో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రెండు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు సలార్ ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయట.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్‌కు 200 కోట్ల వరకు ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయట. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మధ్య సలరా డిజిటల్ రైట్స్ కోసం పోటీ నెలకొందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన గత చిత్రాలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2 రెండు చిత్రాలను ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసింది. దీంతో సలార్ రైట్స్ కూడా సదరు ఓటీటీ సంస్థే దక్కించుకోవాలని చూస్తోంది. మిగిలిన అన్నింటికంటే ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ కాస్త ముందుంది.
ఇది కాకుండా నెట్‌ఫ్లిక్స్ కూడా సలార్ డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతోందని సమాచారం. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆఫర్ చేసేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే డిజిటల్ రైట్స్ ద్వారే సలార్ మేకర్స్ లాభాల బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా శాటిలైట్ హక్కులు కూడా ఉండటంతో మేకర్స్‌కు లాభాలు పక్కాగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. పాన్ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేయనుంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో ఆయన రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12నే విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ప్రాజెక్ట్-కె వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.