కొంతకాలంగా వరుస రాజకీయాలతో బిజీగా ఉన్న అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవిలో విడుదల కావాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పవన్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే టైటిల్, పోస్టర్, లిరికల్ వీడియోను విడుదల చేయగా, టీజర్ లేదా మరో సాంగ్‌ను విడుదల చేస్తారని సమాచారం. దీనిపై సంగీత దర్శకుడు తమన్ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
ఇక పవన్‌కల్యాణ్ 27వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లగానే లాక్‌డౌన్ మొదలైంది. ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా బుధవారం అప్‌డేట్ రానుంది. మధ్యాహ్నం 12.30గంటలకు స్పెషల్ అప్‌డేట్ చేస్తామని చిత్రబృందం తెలిపింది.
పవన్-హరీశ్ శంకర్ అంటే గుర్తొచ్చే చిత్రం 'గబ్బర్ సింగ్'. పవన్ స్టామినాను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రమది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. బుధవారం సాయంత్రం 4.05గంటలకు పవన్ నటిస్తున్న 28వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వనున్నారు. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ అభిమానులకు ఆయన సినిమా నుంచి గిఫ్ట్‌లు అందుతూనే ఉంటాయి.
పవన్ 29వ చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.