Peddha Kapu 1 Movie Review : చిత్రం: పెదకాపు-1; నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేశ్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరి రావు తదితరులు; సంగీతం: మిక్కీ జే మేయర్; సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు; ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్; నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి; రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల; విడుదల: 29-09-2023
ఫ్యామిలీ, లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్ని, నేపథ్యాన్ని అందంగా తెరపై ఆవిష్కరిస్తుంటారు ఆయన. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నారు. అయితే 'నారప్ప' తర్వాత నుంచి ఆయన స్టోరీ టెల్లింగ్ విధానంలో మార్పులు కనిపించింది. ఇక ఆ కొత్త దారిలోనే ప్రయాణం చేస్తున్న ఆయన.. తాజాగా 'పెదకాపు-1' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విరాట్ కర్ణ అనే కొత్త హీరోను ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ ఎలాంటి ప్రభావం చూపించారు? కొత్త హీరో విరాట్ కర్ణ సామాన్యుడిలా ఎలా ఒదిగిపోయారు? ఆ విశేషాలు మీ కోసం..
స్టోరీ ఏంటంటే: 1982లో రామారావు పార్టీ ప్రకటించిన సందర్భం నాటి కథ ఇది. అన్నానికి అలవాటు పడినట్టుగా అధికారానికి అలవాటు పడిన బయన్న (నరేన్), సత్య రంగయ్య (రావు రమేశ్) అనే ఇద్దరు.. లంక గ్రామాల్లోని సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతుంటారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ రావడం వల్ల ఇరు వర్గాల్లో కలవరం మొదలవుతుంది. ఆధిపత్యం కోసం రక్తపాతాన్ని సైతం సృష్టిస్తారు. అయితే ఇందులో సామాన్యులే బలవుతారు. ఆ ప్రభావం సత్య రంగయ్య దగ్గర పనిచేసే పెదకాపు (విరాట్‌కర్ణ) కుటుంబంపైనా కూడా పడుతుంది. తన అన్న కనిపించకుండా మాయమవుతాడు. ఇంతకీ పెదకాపు అన్న ఏమయ్యాడు? ఆత్మగౌరవం కోసం పెదకాపు ఏం చేశాడు? రామారావు ఎవరికి టికెట్ ఇచ్చారు? 1960ల్లో ఆ ఊళ్లల్లో ఏం జరిగింది? అక్కమ్మ (అనసూయ) ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
Peddha Kapu 1 Telugu Movie Review : ఎలా ఉందంటే : ఆత్మగౌరవం కోసం... తనవాళ్ల కోసం నిలబడి పోరాటం చేసిన ఓ సామాన్యుడు.. నాయకుడిగా మారే పరిణామ క్రమమే ఈ సినిమా. తెరపై ప్రధానంగా పెదకాపు సంతకమే కనిపించినప్పటికీ... ఇందులో ఇంకా చాలా పాత్రల ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అందరినీ సృష్టించిన ఆ దేవుడు ఒకరికి కష్టాలు మరొకరికి సుఖాలు ఎందుకు ఇచ్చాడు? చీకటి నుంచి వెలుగులోకి, దుఃఖం నుంచి సంతోషంలోకి రావాలనుకుంటే యుద్ధం చేయాల్సిందేనా? తదితర విషయాల్ని దర్శకుడు తనదైన శైలిలో ఈ కథలో చర్చించారు.
60వ దశకంతో కథ మొదలవుతుంది. అప్పుడు అనాథలా దొరికిన పాప ఎవరనే ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు ఆ తర్వాత 80ల్లోకి కథని తీసుకొచ్చారు. పెదకాపు అనే పేరు ఎందుకు వచ్చిందో... ఆ పాత్ర ప్రపంచం ఏమిటో పక్కాగా పరిచయం చేయకుండానే నేరుగా ఆత్మగౌరవం అంటూ ఊళ్లో జెండా పాతడం నుంచి రంగంలోకి దించారు. పాత్రల్ని, కథా ప్రపంచాన్ని సగం సగం పరిచయం చేసి కథని మొదలు పెట్టడం వల్ల ఆరంభ సన్నివేశాలు అయోమయంగా అనిపిస్తాయి. ఎలాంటి కనెక్టివిటీ, ఎలాంటి భావోద్వేగాలు లేకుండానే సన్నివేశాలు సాగుతూ పోతుంటాయి.
సామాన్యుడి సంతకం అని చెప్పిన దర్శకుడు.. సామాన్యులు మాట్లాడినట్టుగా కాకుండా ప్రతి పాత్రతోనూ స్ట్రాంగ్ డైలాగ్స్‌ను చెప్పించాడు. కాసేపు ఆలోచించి అర్థం చేసుకుంటే తప్ప ఆ మాటలు బోధపడవు. హీరో పాత్ర కూడా మొదట్నుంచీ హీరోగానే కనిపిస్తుంది తప్ప, ఓ సామాన్యుడు అన్నట్టుగా ఉండదు. అలా ఈ సినిమా ఆరంభంలోనే గాడితప్పినట్టు అనిపించినప్పటికీ... హీరో సోదరుడు ఏమయ్యాడు? ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న కథేమిటి అనే ప్రశ్నలు ప్రేక్షకుడిని ఆసక్తిగా, ఓపికగా కూర్చోబెడతాయి. ఇంటర్వెల్ సీన్స్ కథకి మలుపునిస్తాయి. ద్వితీయార్ధంతోనే సినిమాలోని అసలు కథ, పాత్రల ఉద్దేశాలు అర్థమవుతాయి.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి కీలకం. ఇందులో కథేమీ లేదు. గ్రామ రాజకీయాల నేపథ్యంలో వచ్చిన సినిమాల్లోని కథే ఇందులోనూ. సమాజంలో అసమానతలు, కుల వ్యవస్థల నేపథ్యం కారణంగా 'నారప్ప', 'రంగస్థలం', 'దసరా' తదితర సినిమాల ఛాయలు కనిపిస్తాయి. పాత్రలు, అవి నడుచుకునే తీరులోనూ సహజత్వం కనిపించదు. అనసూయ పాత్రని చేరదీసిన మహిళ పాత్ర ఆ తర్వాత ఏమవుతుందో అస్సలు అర్థం కాదు. ప్రేమ కథలోనూ బలం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది కానీ.. కథని నడిపించడంలోనూ, భావోద్వేగాల విషయంలోనూ దర్శకుడు పట్టు కోల్పోయినట్టు అనిపిస్తుంది. రెండో భాగం కోసం ప్రత్యేకమైన ఉత్సుకతని రేకెత్తించకుండానే తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు.
Peddha Kapu 1 Movie Cast : ఎవరెలా చేశారంటే: హీరో విరాట్ కర్ణకి ఇదే తొలి చిత్రమైనప్పటికీ.. ఆ పాత్రలో ఒదిగిపోయారు. నటనలో పరిణతి ప్రదర్శించారు. పోరాట ఘట్టాలు కూడా బాగా చేశారు. ఆయన లుక్స్ బాగున్నాయి. డైలాగ్స్ కూడా ఒకొక్కసారి ఒక్కో రకంగా చెప్పినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ ప్రగతి శ్రీ వాత్సవ అందంగా కనిపించారు. కానీ, ఆ పాత్రలో బలం లేదు. గౌరీ పాత్రలో బ్రిగిడ సహజంగా కనిపించారు. అక్కమ్మ పాత్రలో అనసూయ ఆకట్టుకున్నారు. సినిమాలో కాస్త భావోద్వేగాలు పండాయంటే ఆమె పాత్ర వల్లే. సత్య రంగయ్య పాత్రలో రావు రమేశ్ అసలు సిసలు విలనిజం ప్రదర్శించారు. ఆయన పాత్ర ప్రభావాన్ని కొనసాగించేలా కొడుకు కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్డాల తన నటనతో అదరగొట్టారు. కుర్చీలో కూర్చునే విలనిజాన్ని ప్రదర్శించారు. మరో విలన్‌గా నరేన్ తన పాత్రలో ఒదిగిపోయారు. తనికెళ్ళ భరణి, నాగబాబు, పాత్రలు సినిమాలో కీలకం. రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, శ్రీనివాస్ వడ్లమాని... ఇలా చాలామంది నటులు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రధానంగా ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. గోదావరి నేపథ్యాన్ని ఎంతో అందంగా తెరపైకి తీసుకొచ్చారు. జెండా పాతే సన్నివేశాలు మొదలుకుని చివరి వరకూ ప్రతీ ఫ్రేమ్ అద్భుతం అనిపిస్తుంది. మిక్కీ జె.మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సినిమాకు మరో ఆకర్షణ. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తను రీమేక్ చేసిన 'నారప్ప' ప్రభావంతో ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. మాటలతో మేజిక్ చేసే ఆయన కథ, కథనాలతో పాటు మాటల్ని కాస్త సరళంగా స్పష్టంగా రాసుకోవాల్సిందని ఈ సినిమా చెబుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బలాలు
- + ఛాయాగ్రహణం... నేపథ్య సంగీతం
- + కథా నేపథ్యం
- బలహీనతలు
- - కొత్తదనం లేని కథ, కథనం
- - కొరవడిన భావోద్వేగాలు
- - సాగదీతగా కొన్ని సన్నివేశాలు
- చివరిగా: పెదకాపు 1... తడబడుతూ సాగే సామాన్యుడి సంతకం
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఎన్టీఆర్ డైలాగ్‌తో.. పవర్ ప్యాక్ట్డ్గా 'పెదకాపు -1' టీజర్
Anasuya Latest Interview : 'అవసరమైతే అమ్మమ్మ పాత్రకైనా సిద్ధమే.. కానీ..'