Chances in 24 Crafts of Cinema : రెండున్నరగంటలపాటు ఆనందంగా సినిమా చూసేసినంత సులువేం కాదు.. దాన్ని తీయడం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది ఆ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా 24 విభాగాలకు చెందిన కళాకారులందరూ కలిసిపనిచేస్తేనే చిత్రనిర్మాణం పూర్తవుతుంది. ఇదంతా పక్కనపెడితే... 'అవకాశం రావడమే కదా అసలైన కష్టం' అనే వారికోసమే ఇప్పుడు టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు వచ్చాయి. ఛాన్స్‌ల కోసం ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరాన్ని ఇవి తగ్గించేస్తున్నాయి. సెల్ఫ్ డెమో వీడియోలతోనే టాలెంట్‌ని చూపించే అవకాశం కల్పిస్తున్నాయి. దాన్ని వారు మెచ్చితే చాలు, వెండితెరపై వెలిగిపోవచ్చు. అంటే.. సింగిల్ క్లిక్ దూరంలోనే మీ కోసం అవకాశం కాచుక్కూర్చుని ఉంటుందన్నమాట.
నిజానికి నిర్మాణ సంస్థల అవసరాలను గుర్తించి ఔత్సాహికులకు అవకాశాలు కల్పించే సంస్కృతి హాలీవుడ్, బాలీవుడ్‌లలో ఎప్పటి నుంచో ఉంది. ఈ విధానానికి ఇప్పుడిప్పుడే మన దగ్గరా ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఓ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని టాలీవుడ్‌కి పరిచయం చేశారు సీనియర్ నటుడు జగపతిబాబు. ఈ రంగంలో ఎన్నో ఒడుదొడుకుల్ని తట్టుకుని నిలబడిన జగపతిబాబు ప్రతిభగల కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ఐటీ నిపుణులైన శ్రీధర్, రమేష్ భండారీ, కొరియోగ్రాఫర్ డి.విద్యాసాగర్‌లతో కలిసి 'క్లిక్‌సినీకార్ట్' పేరుతో ఓ వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో నటులైతే ఓ ఫొటో, పోర్ట్‌ఫోలియో...ఇతర రంగాలకు చెందిన కళాకారులైతే వారి కళల్ని తెలిపేలా ఓ వీడియో... అప్‌లోడ్ చేస్తే చాలు. నచ్చితే వారే మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆఖరికి చిత్ర నిర్మాతలుగా రంగప్రవేశం చేయాలనుకున్నా కూడా వీరిని సంప్రదించొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అవకాశాలకి సంబంధించి వన్‌స్టాప్ సొల్యూషన్ ఈ సంస్థ.
దక్షిణాదికి ప్రాధాన్యం దక్కేలా...
'నిర్మాతల పెట్టుబడులూ, దర్శకుడి ఆలోచనలూ, నటీనటులూ, టెక్నీషియన్ల పనితనం వంటివాటన్నింటి సమాహారమే సినిమా. ప్రతిభ గలవారికి అవకాశాలు కల్పించాలన్నా, వారందరినీ ఒకతాటిపైకి తీసుకురావాలన్నా అందుకో వేదిక కావాలి' అంటారు నటుడు రానా. బాలీవుడ్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ అయిన 'కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్'(క్వాన్)ని ఆయనే దక్షిణాదికి తీసుకువచ్చారు. జాతీయ స్థాయిలో దక్షిణాది కళాకారులకు అవకాశాలు కల్పించడం.. ఆర్టిస్టుల ప్రాజెక్టులూ, తేదీలూ...ఇతరత్రా వ్యవహారాలన్నింటినీ క్వాన్ సౌత్ సంస్థ చూస్తుంది.
అలానే విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీతో కలిసి 'పూరీ కనెక్ట్స్' పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతిభగల కొత్త దర్శకులూ, నిర్మాతలూ, నటీనటులూ, సాంకేతిక నిపుణులూ.. ఇలా ఎందరికో దీని ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఇక, సినిమా, వీడియో, సౌండ్, ఫొటోగ్రఫీ తదితర రంగాల్లో రాణించాలనే యువతకూ, ఆయా రంగాల్లో టాలెంట్ కోసం అన్వేషించేవారికి వారధిగా 'సి-స్పేస్' పేరుతో ఓ ఇంక్యుబేషన్ సంస్థను ఏర్పాటు చేశారు హీరో నవదీప్. ప్రొడక్షన్ హౌస్‌ల అవసరాలను తెలియచేస్తూనే.. కొత్తవారికి దీని ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు.
నటనతో పాటు విభిన్న వ్యాపారాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్‌సింగ్.. తమ్ముడు అమన్ ప్రీత్‌తో కలిసి కొత్తగా సినిమాల్లోకి రావాలనుకునే ప్రతిభావంతుల కోసం 'స్టారింగ్ యూ' పేరుతో ఓ స్టార్టప్‌ని నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతిభ ఉన్నవారికి సినీ అవకాశాలు కల్పించడమే ఈ స్టార్టప్ ఉద్దేశం.
ఇవీ చదవండి: రూ. 1000 కోట్లతో డైరక్టర్ శంకర్ సినిమా.. హీరో అతడే?