One role two shades upcoming tollywood movies 2022: "చూడూ... ఒకవైపే చూడూ... రెండో వైపు చూడాలనుకోకు" అంటారు 'సింహా' సినిమాలో బాలకృష్ణ. అలా చాలా సినిమాల్లో కథానాయకుల పాత్రలు రెండో కోణాన్నీ ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. అదొక ఫార్ములా. ఓ సినిమాలో కథానాయకుడి పాత్ర రెండు రకాలుగా ఉంటుందంటే ప్రేక్షకుడిలో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడుతుంది. కథానాయకులకి సినిమా అంతా కూడా ఒకేలా కనిపించకుండా... నటనలో వైవిధ్యం ప్రదర్శించేందుకు మరింత ఆస్కారం ఏర్పడుతుంది. ఒకప్పుడు ద్విపాత్రాభినయాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత ఒకే పాత్రలో రెండు కోణాల్ని ఆవిష్కరించడం ట్రెండ్ అయ్యింది. ఇది రజినీకాంత్ ‘బాషా’ నుంచి కొనసాగుతూనే ఉంది.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని ఓపెన్ చేస్తే చాలు అప్పటిదాకా కనిపించిన కథానాయకుడి పాత్రే, మరో కొత్త రంగు పులుముకుని తెరపై సందడి చేస్తుంది. తొలినాళ్లలో అయితే ‘ఒకరే అనుకున్నావా? కాదు’ అని ఆశ్చర్యపరుస్తూ ఇద్దరు కథానాయకుల్ని తెరపై చూపించేవారు. కానీ ఆ తర్వాత ట్రెండ్ మారింది. ఇతనెవరో తెలుసా? అంటూ ఫ్లాష్‌బ్యాక్ మొదలుపెట్టి ఆ హీరో గతాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ద్విపాత్రాభినయంలో బాలకృష్ణకి తిరుగులేదు. ఎన్నో సినిమాల్లో ఆయన రెండు పాత్రలు చేసి మెప్పించారు. కొన్ని సినిమాల్లో రెండు షేడ్స్ ఉన్న పాత్రలూ చేశారు. ‘రెండోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవ్’ అంటూ హెచ్చరిస్తూనే మరో అవతారాన్ని చూపించి బాక్సాఫీసుని ఊపేయడంలో బాలకృష్ణకి తిరుగులేదు. ఈమధ్య విడుదలైన ‘అఖండ’లో శివుడిగా, మురళీకృష్ణగా అలరించారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోని పాత్ర కూడా రెండు కోణాల్లో సాగుతుందని సమాచారం. విడుదల చేసిన లుక్‌లో పంచెకట్టుతో కనిపించినప్పటికీ, ఈ కథ విదేశాలతోనూ ముడిపడిన నేపథ్యంలో బాలకృష్ణ రెండో రూపం కూడా తెరపై దర్శనమిస్తుందంటున్నారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ రామ్‌చరణ్ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నాడని తెలుస్తోంది. యువ ఐ.ఏ.ఎస్.అధికారి పాత్రని చిత్రబృందం బయట పెట్టినప్పటికీ, ఇందులో ఆయన విద్యార్థిగానూ నటిస్తున్నాడు. రవితేజ కూడా డబుల్ ‘ధమాకా’ ప్రదర్శించనున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’లో రవితేజ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ‘బింబిసార’ సినిమాలోనూ కల్యాణ్‌రామ్ అటు ట్రెండీ లుక్‌లోనూ, ఇటు యుద్ధవీరుడిగానూ కనిపిస్తాడని ప్రచార చిత్రాల్ని బట్టి స్పష్టమవుతోంది. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘థాంక్ యూ’ సినిమా కూడా పలు కోణాల్ని ఆవిష్కరించే పాత్రతో తెరకెక్కినట్టు సమాచారం. శ్రీవిష్ణు కొత్త చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు తెలిసింది. రెండు మూడు కోణాల్లో సాగే పాత్రల్లో నటిస్తున్నప్పుడు కథానాయకుల హావభావాలు మొదలుకొని గెటప్పుల వరకు అన్నీ మారిపోతుంటాయి. ఒకే సినిమా కోసమే అయినా... పాత్రలోని మార్పునకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రపంచానికి అలాంటి భర్త కావాలి: అనసూయ