Bhairava Dweepam Balakrishna: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాససరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భైరవ ద్వీపం'. చందమామ విజయా కంబైన్స్ నిర్మించిన ఈ జానపద చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జానపద హీరోగా బాలయ్య అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా సెన్సార్ చేసినప్పుడు ఒక్క కట్ కూడా లేదు. సెన్సార్ పూర్తయిన తర్వాత మాత్రం.. వాళ్లు ఒక హెచ్చరిక చేశారట! బాణాలకి గుర్రాలు దారుణంగా పడిపోయిన షాట్స్ గురించి చెబుతూ, 'మా వరకూ అభ్యంతరం లేదు. కానీ, వన్య ప్రాణి సంరక్షణ సంఘం వాళ్లు అభ్యంతర పెడితే మాత్రం గుర్రాలు పడిపోయిన షాట్స్ తొలగించమంటారు' అని చెప్పారు. అయితే, ఆ సన్నివేశాలు వాళ్ల దృష్టిలో పడలేదు కాబోలు ఆ షాట్స్ తప్పించుకున్నాయి.
అయితే, గుర్రాలు పడిపోయే విధానం చూస్తే మాత్రం వాళ్లు అంగీకరించరు. గుర్రాలు చాలా వేగంతో పరిగెత్తుతూ వస్తూ ఉంటాయి. వాటి కాళ్లకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు. గుర్రాల కాళ్లకు వైర్లు అడ్డం రాగానే అవి పడిపోతాయి. ఆ పడిపోవడంలో వాటి కాళ్లు విరగవచ్చు. దెబ్బలూ తగలవచ్చు. కాస్త రిస్క్‌తో కూడుకున్న సన్నివేశాలవి. వెంటనే రౌతులు, గుర్రాల యజమానులు వచ్చి పడిపోయిన గుర్రాలను లేపి కాళ్లు, ఒళ్లు చూస్తారు. కొన్ని నడవలేని స్థితిలో ఉంటే వెంటనే వైద్యుడికి చూపించి, వాటికి చికిత్స చేయించేవాళ్లు.
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఎన్బీకే 107'లో నటిస్తున్నారు. ఇటీవల కర్నూల్లో షూటింగ్ జరగ్గా.. జనం పోటెత్తారు.
ఇవీ చూడండి: బాబాయ్ బాలయ్య చెప్పిన ఆ మాట వల్లే ఈ రోజు నేనిలా..: కల్యాణ్‌రామ్