కోలీవుడ్ స్టార్ జోడీ నయనతార, విఘ్నేశ్ శివన్ గత కొన్నిరోజులుగా సరోగసి వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఆరోగ్య మంత్రి దీనిపైన వివరణ ఇవ్వాలంటూ ఆదేశించగా.. నయన్ దంపతులు ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసినట్లు అక్కడి పత్రికల్లో వార్తలు వచ్చాయి. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని పేర్కొంటూ వివాహ నమోదు ధ్రువపత్రాన్ని అఫిడవిట్‌కు జతచేసినట్లు సమాచారం. అంతేకాకుండా నిబంధనల ప్రకారమే గతేడాది డిసెంబర్‌లోనే తాము సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నామని అందులో పేర్కొన్నారట. యూఏఈలో ఉంటోన్న నయన్ బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లలను పొందామని వివరణ ఇచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి.
ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్-విఘ్నేశ్ జంట ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 9న తమకు ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్లు ప్రకటించారు. వీరిద్దరూ సరోగసి పద్ధతిలోనే పిల్లలకు జన్మనిచ్చారని పేర్కొంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. భారతదేశంలో సరోగసి విధానంపై నిషేధం ఉందని.. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారంటూ పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం.. నయన్ దంపతుల నుంచి వివరణ కోరింది.
ఇవీ చదవండి: అమ్మా, నేను చనిపోయాక అతణ్ని వదలకండి. రెండున్నరేళ్లుగా వేధిస్తున్నాడు