ఎన్టీఆర్ మనమడిగా ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో నందమూరి తారకరత్న. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే తారకరత్న కథానాయకుడిగా అరంగేట్రం చేసినప్పుడే ఒకే రోజు తొమ్మిది సినిమాలు మొదలుకావడం ఓ రికార్డు. 'ఒకటో నెంబర్ కుర్రాడు'తో సినీ రంగ ప్రవేశం చేసిన తారకరత్న.. కథానాయకుడిగా , ప్రతినాయకుడిగా పలు సినిమాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నారు. 'యువరత్న' 'తారక్', 'నో', 'భద్రాద్రి రాముడు' సహా 22కిపైగా చిత్రాలతో నటించి మెప్పించారు.
బాబాయ్ సంతకంతో పచ్చబొట్టు..
సినీ నటుడు తారకరత్న అంటే బాలకృష్ణకు ఎంతో ఇష్టం. నటుడిగా ఆయన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి నుంచి అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగతంగానూ అన్నీ తానై అండగా నిలిచారు బాలకృష్ణ. ప్రతి విషయంలోనూ బాబాయ్ వెన్నుతట్టి ప్రోత్సహించేవారని తారకరత్న పలుమార్లు చెప్పుకొచ్చేవారు. తారకరత్నకు కూడా తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ అంటే అమితమైన ప్రేమ. బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతో ఆయన సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు తారకరత్న.
తారకరత్న కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించిన సమయంలోనూ బాలకృష్ణ ఆయన వెంటే ఉన్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేవారు. తారకరత్న కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు కూడా చేయించారు.
కథానాయకుడిగా.. ప్రతి నాయకుడిగా..
హీరోగా ఎన్నో పాత్రలు చేసినప్పటికీ ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది ప్రతినాయకుని పాత్రలే. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన అమరావతి సినిమాలో ప్రతినాయకునిగా నటించిన ఆయన.. తనలోని ఓ కొత్త కోణాన్ని చూపించారు. ఈ సినిమాలో ఆయన నటనకు పలువురు ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఉత్తమ ప్రతినాయకుడిగా ప్రతిష్ఠాత్మక నంది పురస్కారాన్ని అందుకున్నారు. తన బంధువైన నారా రోహిత్ 'రాజా చేయి వేస్తే' అనే సినిమాలోనూ విలన్‌గా నటించి మెప్పించారు. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయే తారకరత్న పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
'మిస్టర్ తారక్' ఇక లేరు
'కాకతీయుడు','వెంకటాద్రి', 'ముక్కంటి', 'నందీశ్వరుడు', 'ఎదురులేని అలెగ్జాండర్', 'చూడాలని చెప్పాలని', 'మహాభక్త శిరియాళ', , 'దేవినేని', 'సారథి', 'ఎవరు' లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. '9 అవర్స్' అనే వెబ్ సిరీస్‌లోనూ తారక రత్న నటించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా 'ఎస్5: నో ఎగ్జిట్'. 'మిస్టర్ తారక్' అనే సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అభిమానులు శోకసంద్రంలోకి మునిగారు.
ప్రేమ వివాహం..
నందమూరి తారకరామారావు ఐదవ సంతానమైన ఛాయాగ్రాహకుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న. ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఆయన పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలా తండ్రి అడుగుజాడల్లో నడిచిన తనయుడు తారకరత్న 2002లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2012లో అలేఖ్యరెడ్డిని వివాహం చేసుకున్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకోగా.. ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఓ గుడిలో కుటుంబాల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటని ఇరు కుటుంబాలూ చేరదీశాయి. అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న హీరోగా నటించిన 'నందీశ్వరుడు' సినిమాకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ జంటకి 2013లో నిష్కా అనే పాప జన్మించింది.