Banda Movie Manoj Bajpayee : ప్రస్తుత రోజుల్లో సినిమా ఏదైనా సరే థియేటర్‌లో విడుదలై ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. లేకపోతే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి కాస్త భిన్నంగా ఓటీటీ నుంచి థియేటర్‌లోకి అడుగుపెట్టి తాజాగా ఓ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? ఓటీటీ నుంచి థియేటర్‌లోకి అడుగుపెట్టడానికి అసలు కారణమేమిటి?
Banda Movie 2023 : బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై'. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. గత నెల 23న జీ5 ఓటీటీ వేదికగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనోజ్ నటనకు అంతటా మంచి మార్కులు పడ్డాయి. సినిమా చాలా బాగుందంటూ సినీ ప్రియులు సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఓ వైపు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్‌లోనూ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. అలా ముంబయిలోని బోరివాలి, బాంద్రా, డోంబివిలి ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో 'బందా' చిత్రాన్ని.. శుక్రవారం నుంచి సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఓటీటీలో విడుదలైన 10 రోజుల్లోనే థియేటర్‌లోకి వచ్చిన మొదటి చిత్రంగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతంలో 'కలర్‌ఫొటో' సైతం ఓటీటీ నుంచే థియేటర్‌లోకి అడుగుపెట్టినప్పటికీ అది కొన్ని నెలల వ్యవధి తర్వాత జరిగింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బందా'కి ఎందుకంత క్రేజ్?
Banda Movie Story : సమాజంలో కొంతమంది దేవుడిగా కొలిచే ఒక బాబా (సూర్య మోహన్) తనను వేధించాడంటూ (అద్రిజ) అనే యువతి పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ యువతి మాటలు నమ్మని సమాజం ఆమెకు వ్యతిరేకంగా మారుతుంది. బాధను అర్థం చేసుకున్న సోలంకి (మనోజ్ బాజ్‌పేయీ) అనే న్యాయవాది ఆమెకు ఆశ్రయమిచ్చి.. కేసు టేకప్ చేస్తాడు. ఆ బాబా మాయలో పడి ఎంతోమంది యువతులు వేధింపులకు గురి అవుతున్నారని తెలుసుకున్న సోలంకి.. సుమారు ఐదేళ్లపాటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తాడు.
మరి సోలంకి కోర్టులో విజయం సాధించాడా? యువతులను ఇబ్బందిపెట్టిన బాబాకు శిక్ష పడిందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే 'బందా' ట్రైలర్ విడుదలైన వెంటనే దేశంలోని ఓ ప్రముఖ ఆశ్రమం చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ వివాదంతో ప్రేక్షకుల దృష్టి 'బందా'పై పడింది. అలా గత నెల జీ5 వేదికగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ 200 మిలియన్లకు పైగా వాచ్ మినిట్స్‌తో మంచి హిట్ అందుకుంది.