Tamil Directors Special Party : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే దర్శకుల్లో టాలీవుడ్ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ మంది ఉన్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే తమిళ స్టార్ డైరెక్టర్లంతా ఒక్క చోట ఎలా ఉంటుంది? అభిమానులకు చూసేందుకు రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఉండే ఆ అరుదైన క్షణం రానే వచ్చింది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఏఆర్ మురుగదాస్, కార్తీక్ సుబ్బరాజు, లింగుస్వామి, లోకేశ్ కనగరాజ్ అంతా ఒక్క చోట చేరి సందడి చేశారు.
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర, యువ దర్శకులందరితో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తరచూ టచ్‌లో ఉంటారు. కొవిడ్ సమయంలోనూ మణిరత్నం.. తమిళ దర్శకులందరికీ జూమ్ కాల్ చేసి మరీ కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. తాజాగా ఆయన కోలీవుడ్ దర్శకులందరికీ స్పెషల్ పార్టీ ఇచ్చారు. గురువారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ మీట్‌లో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఐకాన్ దర్శకులు శంకర్, లోకేశ్ కనగరాజ్, మురుగదాస్, గౌతమ్ మేనన్, కార్తిక్ సుబ్బరాజు, లింగుస్వామి, శశి పాల్గొన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు మాట్లాడుకుంటూ సరదాగా సమయాన్ని గడిపారు.
కాగా, దీనికి సంబంధించిన ఓ ఫొటోని దర్శకుడు శంకర్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. "ఈ సాయంత్రాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు మణిరత్నం సర్‌కు ధన్యవాదాలు. టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్‌ను కలవడం.. మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడుకోవడం.. జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ ఎవర్‌గ్రీన్ పాటలను కార్తిక్ అద్భుతంగా ఆలపించారు. ఈ క్షణాలు నిజంగానే ఎంతో విలువైనవి. మంచి ఆతిథ్యాన్ని అందించిన సుహాసినికి ధన్యవాదాలు" అని ఆయన పోస్ట్ పెట్టారు. శంకర్ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరి వీరిందరి సినిమాల విషయానికి వస్తే.. పొన్నియిన్ సెల్వన్-2తో ఇటీవలే విజయాన్ని అందుకున్నారు మణిరత్నం. లియో పనుల్లో లోకేశ్ బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్, ఇండియన్ -2 ప్రాజెక్ట్‌లపై శంకర్ పని చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ జిగర్ తండ డబుల్ ఎక్స్‌తో బిజీగా ఉన్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ వైపు యాక్టర్‌గా.. మరోవైపు దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. లింగుస్వామి ఇంకా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది.